Kukatpally | కేపీహెచ్‌బీ కాలనీ, మే 1 : రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది… ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంఏ ఖదీర్, కలీం, ఆసిఫ్, బాబా కలీం, షాజీర్, యాసీన్, అహ్మద్ లతోపాటు పలువురు మైనార్టీ నేతలు ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజల విశ్వసనీయత కోల్పోయిందన్నారు. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఏడాది కాలంలో ప్రజలకు జరిగిన మంచి ఏది లేదని చెప్పారు. అందుకే ప్రజలు ఆ పార్టీపై విసుగు చెంది బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు .కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు తదితరులు ఉన్నారు.