తాము అధికారంలోకి రాగానే వృ ద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే ఆసరా పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్లోకి రాగానే ఆ మాటే మరిచిపోయారు. ఆ పింఛన్లతోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగు లు 14 నెలలు దాటినా పింఛన్ల పెంపు ఎప్పుడంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులకు ఇంకా పాత పింఛన్లనే ఇస్తున్నారని మీరు ఇచ్చింది ఉత్తుత్తి హామీనేనా.. అని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పెంపుతోపాటు జి ల్లాలో 30,000 పైచిలుకు మంది అర్హులైన లబ్ధిదారులు తమకు కొత్త పింఛన్లను ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
-వికారాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీలు, ఒకట్రెండు పథకాల గురించే సీఎం, మంత్రులు ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్‌ను రూ. 4,000.. దివ్యాంగుల పిం ఛన్ను రూ. 4,000 నుంచి రూ.6,000లకు పెంచుతామని పలువురు నాయకులు హామీనిచ్చారు.
వారి మాటలు నమ్మి ఓటేసి గెలిపించగా.. 14 నెలలు గడిచినా పెంపు ఎప్పుడో అంటూ ఆసరా పింఛన్‌దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అంటూ కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నా ప్రతి పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెడుతూ అర్హులను లబ్ధిదారుల జాబితాలో లేకుండా చేస్తుండడంతో వేలాది మంది పేదలకు పథకాల ఫలాలు అందడంలేదు.
అదేవిధంగా కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా పాత పింఛన్లే ఇస్తుండడంతోపాటు అర్హులైన 30 వేలకుపైగా లబ్ధిదారులు తమకు కొత్త పింఛన్లు ఎప్పు డంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ప్రతినెలా అందించే పిం ఛన్ డబ్బుల పంపిణీలోనూ జాప్యం జరుగుతుండడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 20లోగా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందగా.. ప్రస్తుత రేవంత్ సర్కారు మరో 20 రోజులు ఆలస్యంగా డబ్బులను పంపిణీ చేస్తున్నది.
ఆసరా పింఛన్లతోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రతినెలా 29 లేదా 30న ప్రారంభమై వారం రోజుల్లో ముగుస్తుండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులు మాత్రం మొదటి వారం పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సి వస్తుండడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కొడంగల్ సెగ్మెంట్‌కు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరు అవుతుండగా.. వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెంట్లకు రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాయి. కాగా జిల్లాలో 98,793 మంది పింఛన్‌దారులకు రూ. 24.38 కోట్ల డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమల్లోకి తెచ్చి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్ డబ్బులను పెంచింది. పింఛన్‌దారులకు అండగా ఉండేందుకు వృద్ధు లు, వితంతువులు తదితరులకిచ్చే రూ. 200 పింఛన్‌ను రూ.1000, దివ్యాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను రూ. 1500, తదనంతరం రెండోసారి అధికారంలోకి రాగానే రూ.1000 నుంచి రూ.2016, దివ్యాంగుల పింఛన్‌ను రూ. 1500-రూ. 3016, తదనంతరం దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.4016లకు పెంచి పేదల ప్రభుత్వంగా కేసీఆర్ సర్కార్ నిలిచింది.
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తా ము అధికారంలోకి రాగానే రూ. 2016గా ఉన్న పింఛన్‌ను రూ.4000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. వారు గద్దెనెక్కి 14 నెలలు దాటినా ఇంకా పింఛన్ డబ్బులను పెంచలేదు. అంతేకాకుండా ప్రతినెలా ఆ డబ్బులను చాలా ఆలస్యంగా చెల్లిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పిం ఛన్ల పంపిణీ సక్రమంగా జరిగింది.
-బీ.నర్సమ్మ రావులపల్లి, మర్పల్లి మండలం
కాంగ్రెస్ నాయకులవి మాటలే .. చేతలు నిల్.. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గొప్పగా చెప్పుకొని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కి ఇచ్చిన అన్ని హామీలను మరిచిపోయారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు దాటినా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. అంతేకాకుండా పింఛన్లను కూడా పెంచలేదు. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్లను రూ.4000 లకు పెంచాలి.
-బుజంగా రెడ్డి దామస్తాపూర్, మర్పల్లి మండలం