LRS | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తాం.’ అంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మరిచింది. అనధికారిక లే అవుట్లు, జీపీ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం… జేబుకు చిల్లుపెట్టేందుకు సిద్ధమైనది.
ఇచ్చిన హామీని పక్కన పెట్టి…ఫీజుల రూపంలో భారీ మొత్తంలో వసూలు చేయనున్నది. ఈ క్రమంలో హెచ్ఎండీఏతోపాటు, నగర శివారులో ఉన్న మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తంగా 7లక్షలకు పైగా ఉన్న పెండింగ్ దరఖాస్తులతో ఖజానా నింపుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2020 నుంచి కార్యాలయాల్లో మగ్గుతున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మార్చి 31 గడువులోగా ఫీజులు చెల్లించుకోవాలని, 25 శాతం రాయితీనిస్తున్నామని ప్రకటించి మరింత గందరగోళానికి కారణమైనది.
దీనికితోడు అస్పష్టమైన విధివిధానాలను ప్రకటించిందే తప్పా… లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో గడిచిన ఐదారేండ్లుగా దరఖాస్తులు పెండింగ్లో ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఇరిగేషన్, రెవెన్యూతోపాటు అనుమతులిచ్చే మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఉంది. దీంతోనే ఇప్పటికీ లక్షలాది దరఖాస్తులను ఎప్పటిలోగా ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడొక అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది.
తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని, పేదోడిపై ఒక్క రూపాయీ భారం మోపకుండానే ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇస్తూ అప్పటి టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి పలు సమావేశాల్లో ప్రకటించారు. కానీ, ఆయన సీఎం అయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయి… ఎల్ఆర్ఎస్పై 25శాతం రాయితీ పేరిట కాంగ్రెస్ మాట మార్చింది. దీంతో పేదోడిపై సగటున రూ. లక్షల భారం పడనున్నది. ఇప్పటికే కొనుగోలు చేసుకుని ఏండ్లుగా ఇబ్బందులు పడుతుంటే, తాజాగా ఎల్ఆర్ఎస్ పేరిట కాంగ్రెస్ తమ జేబులు ఖాళీ చేసేలా ఉందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కనీసం విధి విధానాలు ప్రకటించకుండా మార్చి 31లోపు దరఖాస్తు ఫీజులు చెల్లించాలని ప్రకటించడం వెనుక ఖజానా నింపుకోవాలనే ఉద్దేశమే తప్పా.. సామాన్యులకు లబ్ధి చేయాలని ఏమి లేదని మండిపడుతున్నారు.
హెచ్ఎండీఏతోపాటు, శివారులోని మున్సిపాలిటీల్లో దాదాపు 7లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తులను పలు దశల్లో పరిశీలించి క్రమబద్ధీకరించేలా గత ప్రభుత్వం విధివిధానాలు, ఫీజుల చెల్లింపులను ఖరారు చేసింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఎల్ఆర్ఎస్ పేరిట కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్రెడ్డి… అధికారంలోకి రాగానే… ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పేరిట పేదల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం మార్చి 31 లోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 25శాతం రాయితీతో పరిష్కరిస్తామని తాజాగా ప్రకటించడం ఇప్పుడు గందరగోళానికి కారణమైంది.
గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న లే అవుట్లను అక్రమ ప్లాట్లుగా నిర్ధారిస్తూ, వాటిని క్రమబద్ధీకరించుకోవాలంటూ 2006లో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. క్రమబద్ధీకరణ పేరిట ఖజానా నింపుకొనేందుకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రభు త్వం మొదట ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ను జారీ చేసింది. అప్పటివరకు సజావుగా నడిచిన జీపీ లే అవుట్ల రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులతో స్థానిక సంస్థలకు కూడా ఆదాయం సమకూరింది.
కానీ, ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ఖజానా నింపుకొనే కుట్రతో ఎల్ఆర్ఎస్ పేరిట సామాన్యుడిపై గుదిబండను కాం గ్రెస్ ప్రభుత్వం మోపింది. అయితే బీఆర్ఎస్ హయాంలోనూ ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ జారీ చేసినా… క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, చార్జీలపై పలు రియల్ ఎస్టేట్ సం ఘాల నుంచి వచ్చిన అభ్యంతరాల తో… ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ మరిచి, ఎల్ఆర్ఎస్ పేరిట భారీ మొత్తంలో వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన విధివిధానా లు విడుదల కాలేదు. గత నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేస్తారా? లేక కొత్త మార్కెట్ విలువ ప్రకారం ఫీజులను నిర్ధారిస్తారా? అనేది ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నది.
కానీ, ప్రభుత్వం 25శాతం రాయితీ అని చెప్పి.. ఖజానాను నింపుకొనే ప్రయత్నాలను ముమ్మ రం చేసింది. నిజానికి హెచ్ఎండీఏతోపాటు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మేడ్చల్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు, ఈ రెండు జిల్లాల్లో కలిసి 23 మున్సిపాలిటీల్లో ఏకంగా 7-8లక్షల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి.
– శివారులోని ఓ మున్సిపల్ అధికారి