వికారాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ కార్పొరేషన్ కింద పేద రైతుల పొలాల్లో బోర్లు వేసే పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు మూడేళ్ల క్రితమే ఎంపిక చేసిన సంబంధిత రైతుల పొలాల్లో బోర్లను కూడా వేశారు. 2021-22 సంవత్సరంలో రైతుల పొలాల్లో బోర్లు వేయగా, ఇప్పటివరకు సంబంధిత బోర్లు నిరుపయోగంగా ఉన్నాయి. బోర్లు వేయడంతోపాటు మోటర్లను అందజేయడం, విద్యుత్తు సౌకర్యం కల్పించే బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషన్ అధికారులదే ఉంటుంది. రెండు మూడేళ్లుగా రైతులు మోటర్లతోపాటు విద్యుత్తు కనెక్షన్ ఇప్పించాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఎస్సీ పేద అన్నదాతలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను తీసుకువస్తే అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల పొలాల్లో బోర్లు వేస్తే బోర్వెల్స్ యజమానులు కమీషన్లు ఇస్తారు కాబట్టి.. ఈ ప్రక్రియ వెంటనే పూర్తి చేసిన జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ.. తదనంతరం విద్యుత్తు కనెక్షన్ విషయంలో ఎలాంటి కమీషన్లు రావనే ఉద్దేశంతో పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతున్నది.
పేద ఎస్సీ అన్నదాతల పొలాల్లో సబ్సిడీపై బోర్లు వేసే పథకంతోపాటు బర్రెల స్కీం వరకు ప్రతీ పథకంలో నాకేంటనే ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతులు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ తనకేం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై సదరు అధికారిపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వికారాబాద్ జిల్లా ఏర్పాటైన అనంతరం జిల్లాకు వచ్చిన సదరు అధికారి ఎనిమిదేళ్లుగా అదే పోస్టులో ఉన్నారు. ఏడాది క్రితం మేడ్చల్ జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేస్తే, వారం రోజుల్లోనే తిరిగి జిల్లాకు ఇన్చార్జి అధికారిగా పోస్టింగ్ తెచ్చుకోవడం గమనార్హం. అదేవిధంగా మరెవరూ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పోస్టుకు ప్రయత్నం చేసుకోకుండా గత ఏడేళ్లుగా సంబంధిత శాఖకు సంబంధించి ఆడిట్ చూపకుండా పెండింగ్లో పెడుతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
టే మిల్చ్ యానిమల్ కార్యక్రమం కింద అర్హులైన రైతులకు బర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత కార్యక్రమం కింద జిల్లాలో అర్హులైనవారిని గుర్తించి ఏడాది దాటినా వారికి బర్రెల పంపిణీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సదరు అధికారిపై ఆరోపణలు వస్తున్నాయి. తాను చెప్పిన చోటనే బర్రెలను కొనుగోలు చేయాలని అన్నదాతలకు షరతులు పెడుతున్నట్లు తెలిసింది. కమీషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ గత రెండేళ్లుగా బర్రెల పంపిణీ చేయకుండా జాప్యం చేస్తున్నట్లు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై సదరు అధికారిని వివరణ అడగగా.. ఎందుకు నాన్చుతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వకుండా.. కమీషన్లతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు.
జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో 10 మంది రైతుల పొలాల్లో, తిర్మలాపూర్ గ్రామంలో ఐదు, ధారూరు మండలం నాగారంలో 13 మంది అన్నదాతల పొలాల్లో, తాండూరు మండలం చంద్రవంచతోపాటు మరికొన్ని మండలాల్లో రైతుల పొలాల్లో ఎస్సీ కార్పొరేషన్ కింద మూడేళ్ల క్రితం బోర్లు వేశారు. జిల్లావ్యాప్తంగా 50 మంది అన్నదాతలు మోటర్లతోపాటు విద్యుత్తు కనెక్షన్ల కోసం మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. ఇదే విషయమై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ను వివరణ అడగగా.. విద్యుత్తు కనెక్షన్ తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు రైతులపై నెట్టేయడంతోపాటు మిగతా చోట్ల ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో విద్యుత్తు కనెక్షన్ తీసుకోవడంతోపాటు మోటర్లను కొనుగోలు చేయాలని రైతులకు సూచించినట్లు తెలిపారు