రంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు పెద్దఎత్తున ముందుకొచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తీరా అధికారం చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని మహిళలు వాపోతున్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని డబ్బులు చెల్లించినవారికి తిరిగి సబ్సిడీ డబ్బులు తమ ఖాతాల్లోకి రావటంలేదని వినియోగదారులు వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 70 శాతానికి పైగా తెల్ల రేషన్‌కార్డు కలిగి అభయహస్తానికి అర్హులుగా ఉన్నారు. కాని, వారిలో ఎవరికీ సబ్సీడీ రావటంలేదని మహిళలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇండియన్, భారత్, హెచ్‌పీ వంటి గ్యాస్ కనెక్షన్లను జిల్లా ప్రజలు వాడుతున్నారు. వీరికి మహాలక్ష్మి పథకం 500లకే సిలిండర్ ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తికావస్తున్నప్పటికీ లబ్ధిదారులకు మాత్రం సబ్సిడీ అందటంలేదని వాపోతున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచటంతో సామాన్యులపై మరింత భారం పడింది. ఒక్కో సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంచడంతో గ్యాస్ ధర రూ.855 నుంచి రూ.905కు చేరింది. పెరిగిన గ్యాస్ ధరలతో ప్రతి నెల జిల్లా ప్రజలపై నాలుగు నుంచి ఐదు కోట్ల భారం పడుతున్నది. ఓవైపు సబ్సిడీ రాక.. మరోవైపు పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ ముప్పైవేల వరకు గ్యాస్ కనెక్షన్లు బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో తాము భారాన్ని భరించలేకపోతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్‌కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ అందజేయటంలేదు. ప్రభుత్వం ప్రకటించిన పైలెట్ గ్రామాల్లో తెల్ల రేషన్‌కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ అవసరమైనన్ని కనెక్షన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అరకొరగా కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. మిగతా గ్రామాల్లో పెద్దఎత్తున గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎవరికి ఇవ్వటంలేదు. జిల్లావ్యాప్తంగా ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్య రెండులక్షలకు పైగానే ఉంటుంది. కాని, వీటిలో ఏ ఒక్కరికి కూడా కొత్తగా దరఖాస్తులు ఇచ్చిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాలి. ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాట మార్చటం ఎంతవరకు సమంజసం. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పి నేటికీ అమలు చేయకపోవటం సిగ్గుచేటు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.
– శివరాల జ్యోతి