వికారాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులను నట్టేట ముంచింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పదేళ్లపాటు ప్రతీ సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ఎన్నికల ముందు రైతులకు రూ.16 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం.. అదీ ఏడాదిపాటు కాలయాపన చేసిన తర్వాత రూ.12 వేలే ఇచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో పంట పెట్టుబడి కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతు బంధు సాయాన్ని అందజేయగా, ప్రస్తుతం రైతు భరోసా సాయం కోసం ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో సాయం అందకపోవడంతోపాటు మరోవైపు అప్పులు దొరకక తీవ్ర కష్టాలు పడుతున్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయం అందజేసే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం పంటలను సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందజేస్తామని కొత్త ప్రకటనను తెరపైకి తీసుకువచ్చింది. సీజన్‌కు ఒక్కో మాట చెప్తూ రైతులకు అన్యాయం చేస్తు వస్తున్న రేవంత్ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇంకా పెట్టుబడి సాయం ఎప్పుడు అందజేస్తారనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. పెట్టుబడి సాయం సమయానికి అందకపోవడంతో చాలా మంది పేద అన్నదాతలు తమకున్న ఎకరా, రెండెకరాల పొలంలో పంటలు సాగు చేయకుండా బీడుగానే ఉంచుతున్నారు.
చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడం, పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పంటలను సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా అందించేందుకు నిర్ణయిస్తే చాలా మంది పేద అన్నదాతలు నష్టపోనున్నారు. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలను కూడా సకాలంలో అందజేయని పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం సీజన్లో యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిల్చొన్న రైతులు ఇప్పుడు కూడా అవే సమస్యలు ఎదుర్కోనున్నారు. యూరియా కోసం నేరుగా ప్రభుత్వ విక్రయ కేంద్రాలకు వస్తే యూరియా లేదనే విషయం వెలుగులోకి వస్తుందనే.. యాప్‌ను తీసుకువచ్చి యాప్‌లో బుక్ అయితేనే రావాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు రైతు భరోసా సాయాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే. అదీ ఈ వానకాలం సీజన్లో మాత్రమే పూర్తిగా అందజేయగా, రెండేళ్లుగా రైతులకు మోసపూరిత మాటలను చెప్తూ వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అన్నదాతను రాజుగా చేసే ఆలోచనతో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టడంతోపాటు రైతు బంధు పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పంట రుణాలు తీసుకునే అన్నదాతల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఓ వైపు పెట్టుబడి సాయం అందకపోగా, బ్యాంకర్లు పంట రుణాలను కూడా మంజూరు చేయకపోవడంతో అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని జిల్లా రైతాంగం నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది.