షాబాద్, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో అదునుకు ఖరీఫ్, రబీ సీజన్లలో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాగా.. అన్నదాత లు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలను సాగు చేసుకున్నా రు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రబీ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు పంటపెట్టుబడి సాయం అందనేలేదు. కాంగ్రెస్ వచ్చినంకా రైతుభరోసా సకాలంలో అందక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్ దాటిపోతున్నా ఇప్పటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందలేదు. జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాలకు సం బంధించి గత కేసీఆర్ ప్రభుత్వంలో సుమారు 2,80,000 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రతి సీజన్‌కూ రూ.360 కోట్లు జమ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా రైతుభరోసా అరకొరగా అందించడంతో పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
కేసీఆర్ ఇచ్చే రూ.5 వేలు రైతులకు సరిపోవడం లేదని, కాంగ్రెస్ వస్తే ఎకరానికి రూ.7,500 చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన హస్తం పార్టీ ప్రస్తుతం సక్రమంగా పెట్టుబడి సాయాన్ని అందించకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో పంట సాగు విస్తీ ర్ణం పెద్ద ఎత్తున పెరిగిందని.. కాంగ్రెస్ సర్కార్ పెట్టుబడి డబ్బులు అందించడంలో జాప్యం చేస్తుండడంతో సాగు విస్తీ ర్ణం తగ్గిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రబీ పంట సాయాన్ని ఎప్పుడు అందిస్తుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పులు చేసి పం టలు సాగు చేశామని, ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు అందిస్తే అప్పులు తీర్చుకుంటామని చెబుతున్నారు. ఓట్ల సమయంలో తప్ప రైతులకు అదునుకు డబ్బులు అందించడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని భావించి అప్పులు చేసి రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. రబీ సీజన్ దాటిపోతున్నా ఇప్పటికీ రైతుభరోసా డబ్బులు మాత్రం రాలేదు. ఆ అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. కేసీఆర్ హయాంలో అదునుకు వచ్చింది.
చాలా సంతోషంగా పంటలను పండించుకుని జీవించాం.
-లింగం, రైతు, కుమ్మరిగూడ, షాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు రైతుబిడ్డగా కేసీఆర్ అదునుకు రైతుబంధు డబ్బులను అందించారు. దీంతో ఎవరి దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా రబీ, ఖరీఫ్ సీజన్లలో ఆ డబ్బులతోనే ఎరువులు, విత్తనాలు కొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా రైతుభరోసా డబ్బులు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది.
-కృష్ణయ్య, యువ రైతు, కుమ్మరిగూడ, షాబాద్
అలవికాని హామీలిచ్చిన కాం గ్రెస్ పార్టీ రైతులు, ప్రజలను మోసం చేస్తున్నది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.7,500 ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, మళ్లీ దానిని రూ.6 వేలకు తగ్గించారు. ఆ మొత్తా న్ని కూడా సక్రమంగా అందించక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ హయాంలో అన్నదాతలు సంతోషంగా వ్యవసాయం చేసుకోగా.. ప్రస్తుతం అప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నారు.
-గంగిడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, షాబాద్