బడంగ్పేట్, డిసెంబర్24 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజక వర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న సామ యాదిరెడ్డి గార్డెన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, మహేశ్‌రెడ్డి, ఆనంద్, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, అంజయ్యయాదవ్, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పితే ప్రభుత్వం జీర్ణించుకోలేక అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఉలికిపడుతున్నదన్నారు.
గత రెండు సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై శీతకన్నెందుకు వేశారని ప్రశ్నించారు. కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సప్పుడు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. 90 టీఎంసీలు హక్కుంటే 45 టీఎంసీలు ఇస్తే ఎందుకు ఒప్పుకొన్నారని ఆమె నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.35వేల కోట్లు మంజూరు చేయించి రూ27వేల కోట్లు ఖర్చు చేసి 90శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పది శాతం పనులను ప్రభుత్వం చేయించలేక పోయిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల. పాలమూరు ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయ. అన్ని సమస్యలను అధిగమించి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. రెండు కిలోమీటర్ల మేరకు కాల్వలు తీస్తే నీళ్లు వస్తాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ఆరు నెలలకన్నా ముందు మోటర్లు స్టార్ట్ చేస్తే నార్లపూర్ రిజర్వాయర్‌లో నీళ్లు పడుతుంటే ఎంతో ఆనందం అనిపించింది. కేసీఆర్ ఆలోచన చేయక ముందు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు వస్తాయన్న ఆశ ఉండేది కాదు. పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టిన తర్వాత నీళ్లు వస్తాయని కేసీఆర్ భరోసా కల్పించారు. మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు నీరు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు నీరుతో పాటు ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించడం జరిగింది. కాళేశ్వరం పూర్తి చేశామని, పాలమూరు పూర్తి చేస్తే తన కల నెరవేరుతుందని చాలా సందర్భాల్లో కేసీఆర్ గుర్తు చేసేవారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ప్రాజెక్టుల గురించి వివరిస్తాం. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల గురించి మాట్లాతే కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యం. పాలమూరు జిల్లా కూలీల వలసల, పేదల జిల్లాగా గుర్తించి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. పాలమూరును పక్కన పెట్టి కొడంగల్‌కు నీళ్లు తీసుకపోతామని చెప్పడం ఎంతవరకు సమంజసం. పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పాలమూరు, వికారాబాద్ ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వరు. ప్రభుత్వం కండ్లు తెరచి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే మెడలు వంచి పనులు చేయిస్తాం.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తామని రైతులకు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం చాటేసింది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయించి పది టీఎంసీల నీళ్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్రలు చేసి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేసీఆర్ పేరు లేకుండా ప్రసంగించే పరిస్థితి లేదు. రైతాంగాన్ని ఆదుకునే ఏ ఒక్క పనీ చేపట్టలేదు.పాత పాలమూరు జిల్లాకు 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు 5 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడుకు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారు.
– మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. కేసీఆర్ సాగుకు నీళ్లు ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. కాంగ్రెస్ బూటకపు ముచ్చట్లు చెప్పి ప్రజలను మోసం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పది శాతం పనులు పూర్తి చేయలేక కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి దగా చేశారు. వికారాబాద్, తాండూరుకు నీళ్లు వచ్చే వరకు పోరాటం ఆగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వికారాబాద్, తాండూరు ప్రజలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం. లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి.
– రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో పైసా ఇయ్యలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం పది శాతం పనులు పూర్తి చేయలేక కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలను పట్టించుకోలేదు. రంగారెడ్డి జిల్లాకు కావాల్సిన ఐదులక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజక వర్గాలకు పోయి ప్రజలను, రైతులను చైతన్యవంతం చేస్తాం. భారీ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. తక్షణమే స్పందించి ఉద్దండపూర్ నుంచి నీళ్లు తీసుకరావాలి. లేదంటే ప్రజా యుద్ధం తప్పదు.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. సీఎం, మంత్రుల వద్ద ప్రజలకు చెప్పడానికి సబ్జెక్ట్, సమాధానంలేక రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ పెట్టి వివరణ ఇస్తున్నారు. అరడజన్ మంది మంత్రులు, పోటీపడి ప్రెస్ మీట్ పెట్టారంటే కేసీఆర్ అంటే వారికి ఎంత భయముందో అర్థమవుతున్నది. ప్రాజెక్టులపై, నదీజలాలపై సంబంధిత మంత్రికి ఎలాంటి సబ్జెక్ట్ లేదు. బీఆర్ఎస్ శ్రేణులతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. కేసీఆర్ సమస్యలపై స్పందించడంతో కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది. సీఎం కేసీఆర్‌తో జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టించాలని ప్లానింగ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీమా, నెట్టెంపాడు, మహాత్మాగాంధీ ప్రాజెక్టులను, ఆర్డీఎస్ కెనాల్‌ను పూర్తి చేయడం జరిగింది. సుందిల్ల, ఓఎస్ సాగర్, రమన్పాడు ప్రాజెక్టుల నిర్మాణం చేయించి 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత గార్లపూర్, ఏదుల, గొట్టెం, గడివేల, ఉద్దారం రిజర్వాయర్లను పూర్తి చేయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పాలసీలు తీసుకొస్తున్నట్లు గొప్పలు చెప్పడం జరిగింది. రైతులను వంచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. త్వరలోనే నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టి కాంగ్రెస్‌ను ఎండగడుతాం.
– జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే