వికారాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకొంటున్నా.. ఇండ్లను మంజూరు చేయడం తప్పా అందులో ఎలాంటి పురోగతి మాత్రం కనిపించడంలేదు. పైలెట్ గ్రామాలు, లబ్ధిదారులను ఎంపిక చేసి ఆరు నెలలు పూర్తవుతున్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక్క ఇల్లు కూడా పూర్తికాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అరకొర సాయం తో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. మొదట లబ్ధిదారుల ఎంపిక పూర్తైన వెంటనే రూ.లక్ష సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పడం తదనంతరం తప్పనిసరిగా బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేస్తేనే రూ. లక్ష ఆర్థిక సాయం అందుతుందని నిబంధనలు పెట్టడంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతుభరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు ఇలా అన్నింటిలో పేదలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని నమ్మిన లబ్ధిదారులు ఉన్న ఇండ్లను కూల్చి నెలలు గడుస్తున్నా ఇంకా సాయం అందకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు మార్కింగ్ పూర్తైన ఇండ్లలో కనీసం పది శాతం మంది లబ్ధిదారులకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించలేకపోయింది. జిల్లాకు మొదటి విడతలో 2,309 ఇండ్లు, రెండో విడతలో 8,417 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 5,708 ఇండ్లకు మార్కింగ్ పూర్తికాగా, 628 మంది లబ్ధిదారులు పునాది వరకు చేపట్టగా.. వారిలో 10 శాతం మందికి కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందనేలేదు.
కాగా ఇప్పటివరకు కేవలం 573 మంది లబ్ధిదారులకే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు సమాచారం. గోడల వరకు 69 ఇండ్లు, స్లాబ్ వరకు 25 ఇండ్లు పూర్తయ్యాయి. 53 మందికి రూ.2 లక్షల వరకు, 20 మందికి రూ.4 లక్షల వర కు సాయాన్ని అందజేశారు. చాలామంది ఇండ్లు కూల్చేసి నెలలు గడుస్తున్నా ఇంకా సాయం అందకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అర్హులందరికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించమని జిల్లా లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవాస్తవాలు ప్రచారం చేస్తుండడం గమనార్హం.