రంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గురువారం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రింగ్‌రోడ్డు కోసం 554 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తూ రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. ఓ వైపు రైతులు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు, ఇతర రహదారుల నిర్మాణానికి భూములిచ్చేది లేదని తేగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం మొండిగా భూసేకరణకే ముందుకెళ్తున్నది.
ఫ్యూచర్‌సిటీలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఫేస్-1లో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు 19 కిలోమీటర్లు 33 ఫీట్ల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం ఎక్కువ భాగం ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో నుంచే వెళ్తున్నది. కాగా, పట్టా భూముల రైతులు మాత్రం తమ భూములివ్వమని కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం ఫేస్-2 రేడియల్ రోడ్డు కోసం 554 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే భూసేకరణ జరుగనున్నది. ఇప్పటికే యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా రిలే దీక్ష చేపట్టి.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు మా భూములు ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్‌సిటీ కోసం ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు మూడువందల ఫీట్ల వెడల్పుతో వేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం సుమారు వెయ్యి ఎకరాలు భూమి అవసరముంటుందని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా పేస్-1లో మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు, ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, గుమ్మడవెల్లి, రాచులూరు, పంజాగూడ నుంచి మీర్ఖాన్పేట్ వరకు పేస్-1లో రోడ్డు వేయనున్నారు. పేస్-2లో కుర్మిద్ద, ముద్విన్, కడ్తాల్, ఆకుతోటపల్లి, ఆమనగల్లు, సాకిబండతండాతో పాటు మరికొన్ని గ్రామాల మీదుగా 24 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేయను న్నారు. ఈ రోడ్డుకోసం 554 ఎకరాలతో పాటు మరో 67 ఎకరాలకు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది.
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటులో భాగంగా శంషాబాద్ మండలంలోని నర్కూడ, అమ్మపల్లి గ్రామాల్లో భూసేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి రేడియల్‌రోడ్డు కోసం భూములిస్తే.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని వారికి వివరించారు. కానీ, రైతులు మాత్రం భూమికి భూమి..ప్లాట్‌కు ప్లాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమికి భూమి ఇచ్చేది లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ వెళ్లిపోతుండగా.. పరిహారం విష యం తేల్చకుండా వెళ్లొద్దని రైతులు జాయింట్ కలెక్టర్ కారుకు అడ్డంగా నిలిచి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
జిల్లాలోని యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో 554 ఎకరాల భూములను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ భూములను తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అందులో భాగంగా యాచారం మండలంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, ఆకుతోటపల్లి గ్రామాల్లో 554 ఎకరాలు, అలాగే, ఆమనగల్లు మండలంలోని సాకిబండాతండాలో 67.12 ఎకరాలను సేకరిస్తున్నామని.. భూసేకరణలో భూములు కోల్పోయే రైతుల పేర్లు, కోల్పోతున్న భూముల విస్తీర్ణం తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
రేడియల్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, పరిశ్రమల అవసరాలు వంటి కారణాలతో జిల్లాలో ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. తమకు ఉపయోగంలేని గ్రీన్‌ఫీల్డ్, రేడియల్ రోడ్లు వద్దంటూ రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఇప్పటికే భూసేకరణలో భాగంగా ఆయా గ్రామాల్లో అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో భూములను ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలపలేదు. తమ భూములను రోడ్ల నిర్మాణానికి ఇచ్చేది లేదని అన్నదాతలు తేల్చి చెప్పారు.