రంగారెడ్డి, మే 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్‌లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించాలని నిర్ణయించింది. అజీజ్‌నగర్‌లో 176, 177, హిమాయత్‌నగర్‌లో 151 సర్వే నంబర్లో ఉన్న ఈ భూములను సేకరించి.. అందులో ప్రస్తుతం గుడిమల్కాపూర్‌లో ఉన్న పూలమార్కెట్‌ను ఇక్కడకు తరలించాలని సిద్ధమైంది.
ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో త్వరలోనే ఈ భూముల సేకరణకు నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నది. కాని, ఈ భూములకు సంబంధింది ఇప్పటికే ఆయా గ్రామాల రైతులకు సర్కారు పట్టాలు కూడా కేటాయించింది. కాని, పేదలకిచ్చిన పట్టా భూములను కొంతమంది వ్యక్తులు ఇప్పటికే కొనుగోలు చేసి అందులో రిసార్టులు, పక్కా భవనాలు కూడా నిర్మించారు. ఈ భూములను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
శంషాబాద్ మండలంలో కూడా బస్సు టెర్మినల్ కోసం 150 ఎకరాలు, బుల్లెట్ ట్రైన్ నిర్వహణ కోసం మరికొంత భూసేకరణ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి కేటాయించిన మూడు బుల్లెట్ ట్రైన్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా బెంగళూరు, అమరావతి, పూనే వంటి ప్రాంతాలకు నడపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం బుల్లెట్ ట్రైన్ల నిర్వహణ కోసం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని బహదూర్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూమిలో సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది.
ఎయిర్‌పోర్టును అనుసంధానం చేస్తూ శంషాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం బహదూర్‌గూడ సమీపంలోనే 150 ఎకరాల్లో బస్సు టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది. భూసేకరణ వెంటనే చేపట్టాలని సర్కారు అధికారులను ఆదేశించింది. దీంతో శంషాబాద్, అజీజ్నగర్లలో ఉన్న అవసరమైన ప్రభుత్వ భూములను సేకరించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నది.
ఇప్పటికే రంగారెడి ్డజిల్లాలో ప్రభుత్వ, పట్టా భూముల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. సుమారు 8వేల ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే కొన్ని భూములను సర్కారు సేకరించింది. సేకరించిన భూములతో పాటు కొత్తగా సేకరించాల్సిన భూములను కూడా ఆయా సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
వీటితోపాటు ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో ఫ్యూచర్ సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం మరో వెయ్యి ఎకరాలు.. అలాగే, శంషాబాద్, షాబాద్, కొందుర్గు, చౌదరిగూడ వంటి మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్ల కోసం మరో 660-800 ఎకరాలు సర్కారు సేకరిస్తున్నది. ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు కూడా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వెళ్తుండటంతో భూసేకరణకు రంగం సిద్ధం చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో 493 ఎకరాలను ఎకోపార్కు పేరుతో ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. ఎకోపార్కు పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తుండటంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలో చేపడుతున్న భూసేకరణలతో ప్రజలు, రైతులకు కంటిపై కునుకులేకుండా పోయింది.
