బొంరాస్పేట, జూలై 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తున్నది. ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు అందించే ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి కూడా ప్రభుత్వం మంగళం పాడింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు ఉదయం ఇంట్లో సమయానికి వంటలు వండక ఉపవాసంతో బడికి వస్తున్నారన్న ఉద్దేశంతో గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పేదరికం కారణంగా సరైన పౌష్టికాహారం తీసుకోరు.
అందువల్లే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చదువుపై దృష్టి సారించడానికి ఈ పథకం ఎంతో ఉపకరిస్తుందని భావించిన ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 6వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారం రోజులపాటు రోజుకో మెనూతో అల్పాహారం అందించేవారు. ఇడ్లీ, సాంబారు, రవ్వ ఉప్మా, చట్నీ, పూరి, ఆలుకుర్మా, టమాటాబాత్, కిచిడీ, ఉగ్గాని, పొంగల్, వెజిటబుల్ పలావ్ వంటి వాటిని వండి విద్యార్థులకు వడ్డించేవారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడేది. వికారాబాద్ జిల్లాలోని 1017 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 90 వేల మంది విద్యార్థులకు అల్పాహార పథకంతో లబ్ధి కలిగేది. గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు ఈ పథకాన్ని కొనసాగించారు. డిసెంబరు నుంచి అల్పాహార పథకం అమలు నిలిచిపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఆకలితో పాఠాలు వింటున్నారు.
మధ్యాహ్న భోజన సమయం వరకు విద్యార్థులు ఖాళీ కడుపుతో పస్తులు ఉండాల్సి వస్తున్నది. ఆకలితో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై విద్యార్థులు శ్రద్ధ చూపకపోవడంతో వారి చదువులపై ప్రభావం పడుతున్నది. పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అల్పాహార పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
పథకం రద్దు సరికాదు
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సీఎం అల్పాహార పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ఉన్నత పాఠశాలలకు వెళ్తుంటారు. ఉదయం వీరికి పాఠశాలల్లో ఇచ్చే అల్పాహారం ఎంతో ఉపయోగపడేది. ఈ పథకాన్ని కొన్ని రోజులే కొనసాగించి రద్దు చేయడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.
-సంగప్ప, బురాన్పూర్
అల్పాహారం అందించాలి
అల్పాహార పథకాన్ని తిరిగి ప్రారంభించి విద్యార్థులకు అందించాలి. మారుమూల తండాల నుంచి పేద విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి ఒక్కోసారి ఖాళీ కడుపుతోనే పాఠశాలకు వెళ్తుంటారు. మధ్యాహ్న భోజనం పెట్టే సమయం వరకు అలాగే పాఠాలు వింటున్నారు. అల్పాహారం పెడితే విద్యార్థులకు కొంత ఆకలి తీరుతుంది. పాఠాలు శ్రద్ధగా వింటారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలి.
-పరశురాం నాయక్, సంట్రకుంటతండా