ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ దళం కదం తొక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను చట్టవిరుద్ధంగా విచార ణకు పిలవడాన్ని నిరసిస్తూ గులాబీ సైనికులు ఊరూరా నిరసనలు తెలిపారు. ఆందోళనలతో హోరెత్తించారు.

రంగారెడ్డి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్లపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ నోటీసుల పేరుతో ప్రభు త్వం వేధించడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని మం డలాలు, గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, బైకు ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ, సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. దిష్టిబొమ్మల దహనం సందర్భంగా పలు చోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ అగ్రనేతలపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం వేధించడా న్ని నిరసిస్తూ మహేశ్వరంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లులో బీఆర్ఎస్ నేత రజినీసాయిచంద్, చేవెళ్లలో పార్టీ నేతలు కార్తిక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, కడ్తాల్‌లో బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటేశ్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజిని తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నదని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చటం చేతకాక సీఎం రేవంత్ పాలనను గాలికొదిలేరని.. దీంతో ప్రజల నుం చి వ్యతిరేకత రావడాన్ని తట్టుకోలేకే వారి దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను అక్రమంగా విచారణ పేరుతో వేధించటాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

వికారాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు భగ్గుమన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణను సాధించిన ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూ రితంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగగా.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, పరిగి పట్టణంతోపాటు కులకచర్ల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పంజుగుల శ్రీశైల్రెడ్డిలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యు డు శుభప్రద్ పటేల్‌తో కలిసి తన నివాసం నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు నల్ల కండువాలు ధరించి ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించి శాంతియుత నిరసన తెలిపారు.
తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు నల్ల చొక్కాలు, కండువాలతో మానవహారాన్ని నిర్మించడంతోపాటు.. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి పట్టణంలో నల్లా కండువాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడంతోపాటు కులకచర్ల మండల కేంద్రంలో శాంతియుతంగా నిరసన తెలిపారు. బషీరాబాద్ మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు సిట్ నోటీసుల జారీపై నిరసన తెలిపారు. కాగా, నిరసన తెలిపిన ఆనంద్, శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ ఠాణాకు తరలించారు. మరోవైపు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌కు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని మన్నెగూడ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి చన్గొముల్ ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే కాంగ్రెస్ పార్టీ సిట్ పేరిట నోటీసులు ఇచ్చి వేధిస్తున్నదని మండిపడ్డారు. పదేండ్లపాటు తెలంగాణకు సీఎంగా పనిచేసి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను విచారణ పేరుతో అవమానించడం సరికాదన్నారు. కేసీఆర్‌పై కుట్రలు చేయడం మానేసి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాలని హితవు పలికారు. అదేవిధంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక డ్రామాలు చేయడం మానుకోవాలని సూచించారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
రేవంత్ సర్కార్ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే సిట్ పేరుతో డ్రామాలాడుతున్నది. ప్రభుత్వ చేతకాని తనంతో రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. తెలంగాణ సమాజం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను గమనిస్తున్నారు. త్వరలోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు. -మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు