రంగారెడ్డి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ పీఠం, ఎంపీపీ, జడ్పీటీసీలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, పార్టీ నాయకుడు పట్నం అవినాశ్‌రెడ్డి తదితరులు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అనేక మండలాల నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడ్డారు. ఆరు గ్యారెంటీల అమల్లో విఫలం, రైతులకు యూరియా సరిపడా అందించకపోవడం, పంట రుణాలు మొత్తం మాఫీ కాపోవడం వంటి పలు కారణాలతో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడంలేదని సమాచారం. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి జడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థుల జాబితాను తయారుచేయాలని ఆదేశించారు. కానీ, పోటీకి ఎవరు ముందుకు రావడంలేదని.. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు అన్నీ తామే భరిస్తామని ఎన్నికల్లో పోటీ చేయాలని చెబుతున్నా నాయకులు మాత్రం ముందుకు రావడంలేదని పలువురు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి భారీగా చేరుతున్నారు. ఇప్పటికే ఆమనగల్లు, కడ్తాల్ మండలాల నుంచి ఆయా పార్టీలకు చెం దిన నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేరారు. అలాగే, షాబాద్ మండలంలో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు బుధవారం బీఆర్ఎస్పార్టీ సమావేశం జరుగనున్నది. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టనున్నారు.