లాతూర్: మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో ఓ స్కూల్ టీచర్ విచక్షణారహితంగా సుమారు 32 మంది మైనర్ విద్యార్థుల(Minor Students)ను కొట్టాడు. తన బైక్‌ను ధ్వంసం చేశారన్న అనుమానంతో విద్యార్థులను అతను చితకబాదాడు. ఆ కేసులో టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులను ఆ టీచర్ కొట్టాడు. ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది.
నిందిత టీచర్‌ను ఉజ్వల్ ప్రకాశ్ సోనీగా గుర్తించారు. బైక్ ధ్వంసం కావడంతో సహనం కోల్పోయిన టీచర్ .. వెదురు కర్రతో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. త్వరలో స్కూల్ ప్రిన్సిపాల్‌ను అవుతానని, ఆ తర్వాత మీ సంగతి చూస్తానంటూ ఆ విద్యార్థులను బెదిరించాడు. క్రైస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ .. అహ్మద్‌పుర్ పోలీసు స్టేషన్లో ఆ టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. బీఎన్ఎస్తో పాటు జువెనైల్ చట్టాల కింద టీచర్ సోనిని అరెస్టు చేశారు.