ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటు నమోదు ప్రత్యేక శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు, ఓటర్ ఐడీ కార్డులో మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని బీఎల్వోలకు సూచించారు.
ఓటరుగా రెండుసార్లు నమోదు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తొలగింపులు, దిద్దుబాట్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో వస్తున్న దరఖాస్తులపై ఆయన బీఎల్వోలను ఆరా తీశారు. కలెక్టర్ వెంట వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.