వికారాబాద్, ఫిబ్రవరి 22 : టెన్త్, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి జరుగుతాయని.. ఇందుకోసం జిల్లాలో 310 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 13,412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అందులో బాలురు 6883 మంది, 6477 మంది బాలికలు ఉన్నారన్నారు.
అదేవిధంగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు 29పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 16,823మంది హాజరు కానున్నారని.. మొదటి ఏడాదిలో 7,799 విద్యార్థులుండగా ఇందులో జనరల్ 6,447 మంది, వృత్తి విద్యలో 1352 మంది పరీక్షలు రాయనున్నారని.. ఇంటర్ రెండో ఏడాదిలో 9024 మంది విద్యార్థులుండగా 7,689 మంది జనరల్ కాగా 1,335మంది వృత్తి విద్య కో ర్సుకు సంబంధించిన విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు పది పోలీస్స్టేషన్లను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు.
కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతిలేదని.. కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీ సు అధికారులకు సూచించారు. పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని బస్సులను నడిపించాల ని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో విజయకుమారి, జిల్లా ఇంటర్ అధికారి శంకర్‌నాయక్, డీఈవో రేణుకాదేవి, డీఎంహెచ్‌వో పల్వాన్‌కుమార్, విద్యుత్‌శాఖ ఎస్ఈ జయరాజు, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్చార్జ్ మనోహర్‌దాస్, డీటీవో జస్వంత్‌కుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.