వికారాబాద్, మే 31 : సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సురేశ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయాధికారులతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అందుబాటులో ఉన్న విత్తనాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 2.63 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసే అవకాశముందని, అందుకోసం 5.42 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయన్నారు.
ఇప్పటికే 3.12 లక్షల ప్యాకెట్లు ఉన్నాయని, త్వరలోనే మరిన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రైతులు విత్తనాల విషయంలో ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయాధికారులను సంప్రదించాలని కోరారు. అన్నదాతలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డీలర్లందరూ విత్తన చట్టానికి లోబడి, నిబంధనలను అనుసరిస్తూ ముందుకుసాగాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాల విక్రయించరాదన్నారు. ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్లో వివరాలను నమోదు చేయాలన్నారు. సీడ్ డీలర్లు సైతం సీడ్ సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలని, ఎటువంటి అలసత్వం తగదన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు విధిగా రసీదు ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ఏవో జ్యోతి తదితరులు ఉన్నారు.