నవాబుపేట/మర్పల్లి, సెప్టెంబర్ 26 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. వారం రోజుల కిందట ప్రజాభవన్ ముట్టడికెళ్లి అరస్టైన నవాబుపేట మండలంలోని నారేగూడెం గ్రామ రైతులతో సబితారెడ్డి గురువారం మాట్లాడారు. వారి కష్టా లు తెలుసుకున్నారు.
గ్రామంలో 300 మందికి పైగా రుణమాఫీ కాలేదని అన్నదాతలు తెలిపారు. బ్యాం కులు, వ్యవసాయాధికారుల చుట్టూ పనులు మానుకొ ని తిరిగినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీం తో స్పందించిన ఆమె రుణమాఫీపై బ్యాంకు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులు పాసుపుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. సరైన పత్రాలున్నా రుణం ఎందుకు మాఫీ కాలేదని బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. గత కేసీఆర్ హయాంలో రైతుబంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వాటికి లేని అడ్డంకులు రుణమాఫీకే ఎందుకు వస్తున్నాయో స్పష్టం చేయాలన్నారు.
పూటకో మాట..
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సబితారెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయడం చేతగాకపోతే స్పష్టంగా చెప్పాలని..అంతేగాని ఇలా అన్నదాతలతో ఆటలాడటం సరైన పద్ధతి కాదన్నారు. వారి ఉసురు తగులుతుందన్నారు. ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో ఉన్న ఆలయాలపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని మాటి చ్చి మోసం చేసిన రేవంత్‌కు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
అనంతరం సబితారెడ్డి కేటీఆర్‌తో గ్రామ రైతులతో ఫోన్లో మాట్లాడించ గా.. అధైర్యపడకండి..మీ తరఫున పోరాడుతానని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, యెల్లకొండ పార్వతీపరమేశుల ఆలయ చైర్మన్ పట్లోళ్ల భరత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దయాకర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు మాణిక్‌రెడ్డి, విజయ్, శాంతికుమార్, రమేశ్‌రెడ్డి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
వేధింపులు మానుకోవాలి
మర్పల్లి మండలంలోని పట్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు(దళితులు) ప్రవీణ్, నవీన్‌లను ఓ కేసు విషయంలో మర్పల్లి పోలీసులు అరెస్టు చేసి కొట్టిన విషయం తెలుసుకొని ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వారి ఇండ్లకెళ్లి పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై ఐజీతో ఆమె ఫోన్లో మాట్లాడారు. పోలీసులు ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టకుం డా, వేధించకుండా చూడాలన్నారు. వివరాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలన్నారు. ఇటీవల మం డలంలోని మూడు, నాలుగు గ్రామాల్లో జరిగిన ఘటనలను ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పట్లూరు గ్రామంలో జరిగిన గుర్తు తెలియని మృతదేహంపై ఆరా తీసిన తర్వాతే దోషులెవరో నిర్ధారించాలని ఎస్పీ, ఐజీకి సూచించారు.
పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని లొంగిపోకుం డా పద్ధతిగా ఉండాలని కార్యకర్తలకు హితబోధ చేశా రు. న్యాయం మన పక్షాన ఉంటే ఎంతవరకైనా కొట్లాడుదామని.. ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ అండగా ఉం టుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ నిలదీద్దాం.. అక్రమాలను ఎదిరిద్దామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షు డు అశోక్, ప్రధాన కార్యదర్శి రాచయ్య, యూత్ అధ్యక్షుడు మధుకర్, నాయకులు నాయబ్‌గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అధికారం శాశ్వతం కాదు..
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. అధికారం, ఒక పార్టీ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. ఎవరో ఒక్కరు తప్పు చేసి వ్యవస్థకు మచ్చ తీసుకురావొద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు.