కొత్తూరు, మార్చి 5 : కొత్తూరు కాంగ్రెస్‌లో చేరికల లొల్లి పతాక స్థాయికి చేరింది. మండల కాంగ్రెస్ నాయకులు తమ ప్రమే యం లేకుండానే కొత ్తవారిని చేర్చుకుంటున్నారని.. స్థానిక నాయకులు మంగళవారం గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో కుర్చీలను విరగ్గొట్టి నిరసన తెలిపారు.
కొత్తూరు మండల కేంద్రంలోని బావర్చి హోటల్ కింద వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇన్ముల్‌నర్వకు చెందిన కాంగ్రెన్ నాయకులు ఖాజాపాషా, రవికుమార్‌గుప్తా అక్కడికొచ్చి గలాటకు దిగారు.
తమను సంప్రదించకుండా బీఆర్ఎస్ నాయకులను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో తమకు ప్రత్యర్థిగా ఉన్న వారిని చేర్చుకోవద్దంటూ నిరసనకు దిగారు. మాటామాట పెరగడంతో అక్కడ ఉన్న కుర్చీలను విసిరి విరగొట్టారు. మండల నాయకులు కిందిస్థాయి నాయకులను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రత్యర్థి వర్గాన్ని పార్టీలో చేర్చుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము పదేండ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని.. ఇప్పుడు అధికారాన్ని అనుభవించేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు వస్తే ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి కార్యకర్తలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. దీంతో చేరికల కార్యక్రమం వాయిదా పడింది.
హైకమాండ్ ఒకటి తలిస్తే..
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ రా ష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గ్రామాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్కే పట్టు ఉన్నది. ముఖ్యంగా సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు చెందిన వారే అధికంగా ఉన్నారు. వారిని కాంగ్రెస్‌లో చేర్పించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో మాజీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మండల నాయకు లు ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారు.
అయితే స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం వారి చేరికను ఒప్పుకోవడంలేదు. తమను సంప్రదించకుండా ఎవరినీ చేర్చుకోవద్దని షరతులు పెడుతున్నారు. అయితే మంగళవారం జరిగిన గొడవతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు జంకుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్లలో వా రికే సఖ్యత ఉండదని..
ఒకవేళ తాము ఆ పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడికి ఫోన్ చేసి మీ పార్టీ నాయకులే కుర్చీలతో కొట్టుకుంటున్నారు.. మరి మేం వస్తే పరిస్థితి ఏమిటన్న అని అడగడం కొసమెరుపు.