Varalaxmi Sarathkumar | కోలీవుడ్ మ్యాచో మ్యాన్ శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పొడా పొడి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన వరలక్ష్మి, తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి పేరు సంపాదించారు. అయితే కమర్షియల్ హీరోయిన్గా ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కలేదు. తరువాత ‘పందెంకోడి 2’ లో కీలక పాత్ర పోషించడంతో తన కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు, క్యారెక్టర్ ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగారు. అయితే ఆమెకు నిజమైన బ్రేక్ ఇచ్చింది మాత్రం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘జయమ్మ’ పాత్రలో వరలక్ష్మి అద్భుత నటనతో మెప్పించారు. ఈ పాత్ర ఆమెకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖ నటులు కూడా ఆమె నటనను ప్రశంసించారు. ఇప్పుడు వరలక్ష్మి నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగానూ మరో అడుగు వేస్తున్నారు. ఆమె నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్రవంతి’. ఈ సినిమాలో ప్రియమణి, కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారం ట్రైలర్ విడుదల కార్యక్రమం రీసెంట్గా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపీచంద్ మలినేనిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతుండగా ఎమోషనల్ అయ్యారు. “గోపీ సార్ నా స్నేహితుడు, గురువు, మెంటర్. ఆయన వల్లే నేను తెలుగులో రీలాంచ్ అయ్యాను. ఆయన నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. ఎప్పటికీ ఆయనను అభిమానిస్తూనే ఉంటాను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, ఈ సినిమాను పెద్ద స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రీలో మహిళలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. తన ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘క్రాక్’లో జయమ్మ పాత్రతో మెగాస్టార్ సహా పలువురి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటిగా సత్తా చాటిన ఆమె, దర్శకురాలిగా ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలి.