కొత్తూరు, మార్చి 25: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా అన్నారు. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫూలే విగ్రహం నుంచి కొత్తూరు వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఈఎస్ఐ, ఫీఎఫ్ అందించాలని కోరారు. వారికి కనీస జీతం రూ. 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ కోఠిలోని కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆశా వర్కర్లపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.