షాద్నగర్ : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మణిహారంగా నిలిచేలా బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, అందుకు తగిన విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఇందులో భాగంగానే బుధవారం తన కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. బైపాస్ నిర్మాణంపై అంచనాలు తయారు చేయాలని, పూర్తి ప్రణాళిక రూపొందించాలని ఆర్అండ్బీ అధికారులను అదేశించారు. మహేశ్వరాన్ని ఒక ప్రతిష్టాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ హాస్టల్ నుంచి చౌరస్తా వరకు రూ. 3కోట్ల 50లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులు, సెంట్రల్ లైటింగ్ సుందరీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రూ. కోటి 45లక్షలతో మన్సన్పల్లి సర్కిల్ అభివృద్ధి చేయడంతో పాటు మహేశ్వరం గేట్ నుంచి మహేశ్వరం వరకు రూ. 5కోట్ల 40 లక్షలతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ చేపడుతున్నామని తెలిపారు. వీటికి సంబంధించి అన్ని ప్రక్రియలు 15రోజుల్లో పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎంపీపీ రఘుమారెడ్డి, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో నర్సింహ, ఆర్అండ్బీ డీఈ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.