Chevella | చేవెళ్ల టౌన్, మార్చి 20 : చేవెళ్ల మండల పరిధిలోని గుండాల, రేగడి ఘనపూర్ ఫీడర్ల పరిధిలోని గ్రామాలలో క్యారెట్, పూలు, కూరగాయలు సాగు అత్యధికంగా సాగు చేస్తారని చేవెళ్ల గ్రామానికి చెందిన కిచ్చన్న గారి వెంకట్ రెడ్డి తెలిపారు. క్యారెట్ సాగు నేపథ్యంలో సాయంత్రం 7గంటల వరకు వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అందించాలని గురువారం చేవెళ్ల విద్యుత్ ఏఈకి వినతి పత్రం అందజేశారు.
ఈ సీజన్లో రైతులు ఎక్కుడగా క్యారెట్ సాగు చేస్తారు. క్యారెట్ దిగుబడిలో భాగంగా రైతులు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు క్యారెట్ కడగడానికి విద్యుత్ సరఫరా చాలా అవసరం అని వెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని గుండాల ఫీడర్ పరిధిలోని సాయంత్రం పూట విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటున్నారని వివరించారు. సాయంత్రం వేళలో కరెంట్ కటింగ్ మూలంగా మధ్యాహ్నం వేళ్లల్లో క్యారెట్ కడుగుతూ ఎండ వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపారు. అందుకు రైతులకు సౌకర్యార్థం సాయంత్రం 7గంటల వరకు విద్యుత్ కటింగ్ లేకుండా సరఫరా చేయాలని కోరారు.