వికారాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. పక్కా ప్లాన్‌తో సొత్తు, నగదును తస్కరించి పరారవుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి తదితర ప్రాంతాల్లో దొంగతనాల కేసులు నమోదవుతున్నా.. పోలీసులు సరి గ్గా నిఘా పెట్టకపోవడం గమనార్హం.
ఏదైనా చోరీ జరిగిన రెండు, మూడు రోజుల వరకు రాత్రివేళల్లో గస్తీ నిర్వహించడం తదనంతరం పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. చోరీ కేసుల ఛేదనలోనూ పోలీసులు కొంత అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే, జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట్ర దొంగల ముఠాలేనంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా కేం ద్రంలో చెడ్డీగ్యాంగ్ హల్చల్ అంటూ ప్రచారం జరిగిం ది.
అయితే వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వికారాబాద్ పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో రెండు ఇండ్లలో చోరీలు జరుగగా.. దొంగలు అచ్చం చెడ్డీగ్యాంగ్ మాదిరిగా ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో జిల్లా కేం ద్రంలో చెడ్డీ గ్యాంగ్ అంటూ పుకార్లు వచ్చాయి. జిల్లా లో తాజాగా జరిగిన చోరీ కేసుతోపాటు తాండూరు, పరిగిలలో జరుగుతున్న చోరీలన్నీ అంతర్రాష్ట్ర ముఠాల పనేనని గుర్తించిన జిల్లా ఎస్పీ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
గత నాలుగైదు నెలల్లో జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో చోరీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వరుసగా రెండు, మూడు రోజులు సెలవులొస్తే.. ఆ సమయంలోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముందుగానే ఏ ఇంటికి తాళం ఉందనేది దుండగులు రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. విహారయాత్రకో, వివాహాలకో వెళ్లొ చ్చే సరికి ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు ఇల్లును గుల్ల చేస్తున్నారు. వికారాబాద్, తాండూరు పట్టణాల్లో నమోదవుతున్న కేసులకు సంబంధించి దొంగలు రైళ్లలో వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వరుస చోరీలు, చైన్‌స్నాచింగ్‌లపై జిల్లా పోలీసులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళల్లో గస్తీ నిర్వహించాల్సిన కొందరు పోలీసులు కేవలం మూసివేయని హోటళ్లు, దుకాణాల వద్ద గస్తీ నిర్వహిస్తున్నారే తప్ప కాలనీల్లో మాత్రం గస్తీ నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలు, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఒకట్రెండు సార్లు పెట్రోలింగ్ నిర్వహిస్తే చాలా వరకు చోరీలు తగ్గే అవకాశముందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.
రెండు రోజుల కిందట దుండగులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో రెండు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిపూర్లో ఓ ఇంట్లో 45 తులాల బంగారం.. అదే రోజున తాండూరు మున్సిపాలిటీ పరిధిలోనే 17 తులాల బంగారంతోపాటు రూ.5 లక్షలు దోచుకెళ్లారు. పరిగి మండలంలోని హనుమాన్‌గండి తండాలో రూ.10 లక్షల విలువ చేసే 9 తులాల బంగారం, అర కిలో వెండి, 60 వేల నగదును తస్కరించారు. తాండూరు మండలంలోని గౌతాపూర్‌లో గొర్రెలు, హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుంచి రూ.16,000, బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఓ మహిళా మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగలు దోచుకెళ్లారు. అయితే వీటిలో ఇప్పటివరకు ఒక్క కేసునూ ఛేదించకపోవడం గమనార్హం.
జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సా రించం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు జరిగిన చోరీ కేసు ల్లో కొన్నింటినీ ఛేదించడంతోపాటు సొత్తును కూ డా రికవరీ చేశాం. మరోవైపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోరీ చేసింది అంతర్రాష్ట్ర ముఠానే.. చెడ్డీ గ్యాంగ్ కాదు. దొంగలు రైళ్లలో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇక్కడికి వచ్చి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటాం.
– నారాయణరెడ్డి, వికారాబాద్ ఎస్పీ