ఆమనగల్లు, సెప్టెంబర్ 20 : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి ఆ బియ్యాన్ని రేషన్ షాపులకు విక్రయిస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలో శనివారం ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
ఆమనగల్లు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి శనివారం మధ్యాహ్నం 5 బస్తాలు 2.50 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని ఓ రిక్షాలో తరలిస్తుండగా స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో సమీపంలో ఉన్న ఓ రేషన్ షాపునకు తరలించారు.
ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మిని సెల్ఫోన్లో వివరణ కోరగా.. గతంలో ఆ రేషన్ షాపు డీలర్ నుంచి బియ్యాన్ని బదులుగా తీసుకున్నామని.. అందుకోసమే అతడికి ఆ బియ్యాన్ని తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి బియ్యాన్ని సరఫరా చేస్తారు. డీలర్ల నుంచి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని ప్రశ్నించగా.. పొరపాటు జరిగిందని ఇక నుంచి అలా జరుగకుండా చూసుకుంటానని చెప్పారు.