వికారాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలను అమలు చేసి ఆపద్బాంధవుడిలా కేసీఆర్ పేరొందితే, అధికారం చేపట్టిన ఏడాదికే అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం గమనార్హం. చివరకు ఉపాధి హామీ కూలీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని రూపుమాపేందుకు అమల్లోకి తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో పూర్తిగా నిర్వీర్యమవుతున్నది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయించామని ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా వేసవిలో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే అదనపు వేతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు వేసవిలో అదనపు వేతనాన్ని అందించి కూలీలకు అండగా నిలువగా, రేవంత్ ప్రభుత్వం మాత్రం గతేడాది ఇస్తామంటూ మే వరకు పొడిగిస్తూ పోయి చివరకు అదనపు వేతనాన్ని కూలీలకు అందించలేకపోయింది. ఈ ఏడాది అయితే అదనపు వేతనం వస్తుందని మార్చి మొదటి వారం నుంచి ఎదురుచూస్తున్న కూలీలకు.. ఈ ఏడాది అదనపు వేతనం పూర్తిగా బంద్ చేసినట్లు అధికారులు తేల్చి చెబుతుండడం గమనార్హం. దీనిపై కూలీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
కక్ష సాధింపు చర్యలు
పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గత మూడేళ్లుగా లక్షల్లో పని దినాలను తగ్గించి పేదల కడుపు కొడుతూ ఉపాధి హామీ పథకంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నది. కేవలం మూడేళ్లలోనే దాదాపు 50 లక్షల పనిదినాలను తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా బంద్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుండగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
అదనపు వేతనం నిలిపివేత
ప్రతి ఏటా వేసవిలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు అదనపు కూలీ డబ్బులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. వేసవిలో భానుడి ప్రతాపంతో అధిక సమయం పనిచేయలేరు, దీంతోపాటు మండే ఎండలోనూ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న దృష్ట్యా అదనంగా కూలీ డబ్బులను పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మాసాల్లో అధిక మొత్తంలో అదనపు కూలీ ఇస్తూ వచ్చారు. ఫిబ్రవరి నెల నుంచి ఎండల తీవ్రత ఎక్కువుగా ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు అందజేసే వేతనాన్ని ఫిబ్రవరిలో 20 శాతం అదనంగా, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే మాసాల్లో 30 శాతం అదనంగా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు వేతనాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.150 కోట్ల చెల్లింపులు
మరోవైపు ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో వారంలోగా అదనపు కూలీ ప్రకటన వస్తున్నప్పటికీ గత రెండేళ్లుగా అదనపు కూలీ డబ్బుల ప్రకటన రాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 67.37 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 60 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.300 కూలీ డబ్బులను అందజేస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను ఇప్పటివరకు రూ.150 కోట్ల వరకు చెల్లింపులను పూర్తి చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా.. 4,38,398 మంది కూలీలున్నారు.