అన్నదాతలు ఆగం కావద్దన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. పోలీస్, వ్యవసాయ, విత్తనాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాలో జిల్లాస్థాయి టీంతోపాటు సబ్ డివిజిన్ స్థాయిలో మూడు టాస్క్‌ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ నకిలీల భరతం పడుతున్నారు. ప్రతి ఫెర్టిలైజర్ షాపులో విత్తన ప్యాకెట్లను ఎక్కడ తయారు చేశారు? ఎక్కడ ప్యాకింగ్ చేశారు. ఎవరు మార్కెటింగ్ చేయిస్తున్నారు? అనే పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా రెండు జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు ఊరూరా రైతు వేదికల్లో అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని, హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయించవద్దని సూచిస్తున్నారు. వానకాల సీజన్‌కుగాను యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు, విత్తనాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచింది.
– రంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం జిల్లాస్థాయి, డివిజినల్ స్థాయిల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించింది. ఒక జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ టీంతోపాటు సబ్ డివిజినల్ స్థాయిలో మూడు టాస్క్‌ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయాధికారులు, పోలీసులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాస్థాయి టీంలో ఏడీఏ, సీఐ, విత్తనాభివృద్ధి అధికారితో టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి సబ్ డివిజినల్ స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించారు. సబ్ డివిజినల్ స్థాయి టీంలో ఏడీఏతోపాటు సీఐ, విత్తనాభివృద్ధి సంస్థ అధికారితోపాటు సబ్ డివిజనల్ స్థాయి టాస్క్‌ఫోర్స్ టీంను నియమించారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాల బారిన పడి ఎంతో కొంత మంది రైతులు నష్టపోతున్న దృష్ట్యా ఈ ఏడాది ఏ ఒక్క రైతూ నష్టపోవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లాలో పక్కా నిఘా పెట్టారు. నకిలీ విత్తనాలపై జిల్లా రైతాంగానికి కూడా జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఊరూరా రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లా అంతటా విస్తృతంగా తనిఖీలు
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పెట్టేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. గతేడాది నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి 8 కేసులు నమోదుకాగా, రూ.35.28 కోట్ల విలువ చేసే 27.98 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అవగాహన కార్యక్రమాల్లో పత్తి సాగు చేసే రైతులు పత్తి విత్తనాలను లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొందరు గ్రామాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంపై టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించారు.
సరిపడా విత్తనాలు సిద్ధం
జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా 5.80 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు, వరికి సంబంధించి 33,922 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 2716 క్వింటాళ్లు, పెసర్లు-761, కందులు-5272 క్వింటాళ్లు, మినుములు-315 క్వింటాళ్లు, సోయాబీన్-899 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను 65 శాతం మేర సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. వానకాలం సీజన్‌కుగాను యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు 74,683 మెట్రిక్ టన్నులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా 28,867 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,360., కాంప్లెక్స్ ఎరువులు 21,899., ఎంవోపీ 6206., ఎస్ఎస్పీ 2351 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని సంబంధిత అధికారులు నిర్ణయించారు. పత్తి 2.70 లక్షల ఎకరాలు, కంది 1.50 లక్షలు, మొక్కజొన్న 40 వేలు, వరి 1.30 లక్షలు, మినుములు 5252, సోయాబీన్ 2999, పెసలు 12,690 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికను రూపొందించారు.
రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామాలు, పట్టణాల్లోని ఫెర్టిలైజర్ షాపులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను పరిశీలిస్తున్నాయి. కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అక్రమార్కులను హెచ్చరిస్తున్నారు. 2023-24 సీజన్‌కు సంబంధించి వరి 87,000 ఎకరాలు., పత్తి 1,99,000., కందులు 31 వేలు, మక్కజొన్న 90 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు.
విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన
కాలానికి అనుగుణంగా పంటల సాగుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రశీదు ఉంటేనే పంట నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి రైతులు ఆర్థిక సాయం పొందే వీలుంటుంది. విత్తన ప్యాకెట్లపై అవి ఎక్కడ తయారు చేశారు. వాటి మొలక శాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలను కూడా రైతులు పరిశీలించాలి. లేదా ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి కలెక్టర్ హరీశ్ పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇందుకు మూడు టాస్క్‌ఫోర్స్ (మండల స్థాయిలో ఒక్కొక్క) బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో రాచకొండ, సైబరాబాద్ సీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీల నేతృత్వంలో 18వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పోలీసుల తనిఖీలు మండల స్థాయి నుంచి ప్రముఖ ప్రధాన పట్టణాలలోని దుకాణాలతోపాటు గోదాముల్లో కొనసాగుతున్నాయి. ప్రతి ఫెర్టిలైజర్ షాపులో విత్తన ప్యాకెట్లను ఎక్కడ తయారు చేశారు? ఎక్కడ ప్యాకింగ్ చేశారు. ఎవరు మార్కెటింగ్ చేయిస్తున్నారు? అనే పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. గడువు ముగిసిన విత్తనాలు అమ్మొద్దని, లైసెన్స్ లేకుండా విక్రయాలు కొనసాగించొద్దని షాపుల యజమానులకు అధికారులు సూచిస్తున్నారు. విత్తన డీలర్లు దుకాణాల్లో తప్పనిసరిగా షాపు లైసెన్స్ ప్రదర్శించాలని, విత్తనాలు, ఎరువుల విక్రయాల బిల్లును రైతులు పూర్తి వివరాలతో అందించాలని, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, ఫారం డీ సమర్పణ, లైసెన్స్ రెన్యువల్, షాపు మార్పు వివరాలు లైసెన్స్‌లో నమోదు చేసే అంశాలపై ఇప్పటికే విత్తన డీలర్లు, వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.
జిల్లాలో 414 ఫెర్టిలైజర్ దుకాణాలు
రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 414 లైసెన్స్ ఫెర్టిలైజర్ దుకాణాలున్నాయి. జిల్లాలో కల్తీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు లేవని.. ఐదేండ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిస్తే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు (7288894642) సమాచారమందించాలని అధికారులు ప్రజలు, రైతులకు సూచిస్తున్నారు.
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి. హెచ్‌టీ పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి రైతులు హెచ్‌టీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
కల్తీ నివారణకు తనిఖీలు
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
ఖరీఫ్ (వానకాలం) సీజన్ మొదలు కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలపై తనిఖీలు చేపడుతున్నాం. అక్రమార్కులపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సీజన్‌కు అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పకుండా రశీదు తీసుకోవాలి. జిల్లాలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు అమ్ముతున్నట్లు తెలిస్తే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు లేదా టాస్క్‌ఫోర్స్ బృందాలకు సమాచారం అందించాలి.