హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన నీటి డిమాండ్లను రెండో దశలో నెరవేరుస్తామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొదటి దశకు ఒప్పుకోవాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తేల్చిచెప్పింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీసీ లింక్ నీటి కేటాయింపులపై సర్దుకుపోవాలని సలహా ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ రాసింది. జీసీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన 6వ సంప్రదింపుల సమావేశాన్ని ఆగస్టులో హైదరాబాద్ వేదికగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ పలు వాదనలు వినిపించింది.
జీసీ లింక్‌లో మళ్లించే 148 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 50% వాటా (74 టీఎంసీలు) కేటాయించాలని, తెలంగాణ ప్రాజెక్టులపై పడే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయించాలని, ఆపరేషన్ ప్రొటోకాల్‌పై స్టడీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ అంశాలపై తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ సమాధానమిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. నదీ జలాలు వృథాగా సముద్రంలో కలువకుండా నిరోధించి దేశ ఉత్పత్తిని, విద్యుత్తు అవసరాలను మెరుగుపరచడంలో భాగంగా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నామని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ తన వాటా కింద ఉపయోగించుకోని 148 టీఎంసీల జలాలనే మొదటి దశలో మళ్లిస్తామని, రెండో దశలో హిమాలయాల నుంచి మహానదికి, మహానది నుంచి గోదావరికి నీటిని తీసుకురావాల్సి ఉంటుందని వివరించింది. మొదటి దశలో నీటికేటాయింపులపై సర్దుకుపోవాలని, రెండవ దశలో జల డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని, జీసీ లింక్‌కు అంగీకరించాలని తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ నిర్వాసితుల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. పరిహారం మొత్తం చెల్లింపు విషయమై ఉద్దండాపూర్ నిర్వాసితులు గత కొన్నేండ్లుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు నిండిన యువతకు సైతం రూ.6 లక్షల చొప్పున చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అందుకు అదనంగా రూ.146 కోట్లు అవసరమవుతాయన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా 3 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.