హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాళోజీ హెల్త్ వర్సిటీలో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం, గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు రాసిన లేఖతో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. బాధ్యుడిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయిన కాసేపటికే శుక్రవారం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్‌రెడ్డి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. డాక్టర్లు కావాల్సిన మెడికల్ విద్యార్థులు ఫెయిలైన తర్వాత అడ్డదారిలో పాస్ చేయించుకొనేందుకు య త్నించడం, ఇందుకు వర్సిటీ అధికారులు సైతం సహకరించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ కాగా, రీవాల్యూయేషన్ పేరిట వారిని మళ్లీ పాస్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదెలా సాధ్యమైందని కొంతమంది ఆరా తీయగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. పీజీ వైద్య పరీక్షల్లో విద్యార్థులకు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్లెట్ ఇస్తారు. దానిపై విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. బుక్‌లెట్‌లో మిగిలిపోయిన పేజీలపై ఇంటూమార్క్ (కొట్టివేత)ను అధికారులు వేస్తారు. అలా క్రాస్మార్కింగ్ చేసిన తరువాతే ఇన్విజిలేటర్లు విద్యార్థుల ఆన్సర్‌షీట్లను తీసుకుంటారు. తర్వాత వాటిని స్కాన్ చేసి జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కళాశాలలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వాటిని ఆన్లైన్లోనే దిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇక సాఫ్ట్‌వేరే మొత్తం జవాబులకు వేసిన మార్కులను లెక్కిస్తుంది. అయితే, కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాల్లో ఇంటూమార్క్ వేసిన పేజీల్లోనే జవాబులు రాసి ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. కొట్టివేసిన ఇంటూమార్క్ ఉన్న పేజీల్లో రాసిన జవాబులను లెక్కలోకి తీసుకోరు. కానీ, ఆయా జవాబులకు మళ్లీ మార్కులు వేసి పాస్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
పీజీ పరీక్షల్లో రీవాల్యూవేషన్‌కు అవకాశమే ఉండదు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. అయినా, విద్యార్థులను పాస్ చేయడం కలకలం రేపింది. ఆరోపణలు తీవ్రతరం కావడం, ప్రభుత్వం దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో ప్రాథమిక విచారణ చేయించాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తూను సర్కారు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఓ కమిటీ వేశారు. విచారణలో ఓ విద్యార్థినిని పాస్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వర్సిటీ ఇటీవల విడుదల చేసిన పీజీ ఫలితాల్లో 205 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా, వీరిలో 155 మంది రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. అయితే, వర్సిటీ అధికారులు పాస్‌చేసిన సదరు విద్యార్థినికి అసలు హాల్టికెటే లేదని విచారణ సందర్భంగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ నెల 21న విద్యార్థిని పాస్ అయినట్టు వెల్లడించడం వివాదాస్పదంగా మారింది. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను హెల్త్ సెక్రటరీకి అందజేసింది. హెల్త్ సెక్రటరీ, సీఎస్ రామకృష్ణారావు.. వర్సిటీ వీసీ నందకుమార్రెడ్డితో సచివాలయంలో మాట్లాడి జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
కాళోజీ వర్సిటీ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సైతం గవర్నర్, జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) చైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. ప్రతిష్ఠాత్మక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా.. వీసీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు లేఖతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చింది. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్చార్జుల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉన్నతస్థాయిలో పనిచేసే వారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని స్పష్టంచేశారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే నాటకీయంగా వీసీ తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించారు.