న్యూఢిల్లీ, నవంబర్ 28: రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఐదేండ్ల పదవీ కాలాన్ని మార్చే రాజ్యాంగపరమైన హక్కు పార్లమెంట్‌కు ఉందని జమిలి ఎన్నికల బిల్లులపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘానికి(జేపీసీ) 23వ లా కమిషన్ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 83, 172 అధికరణలలో పొందుపరిచిన ఐదేళ్ల పదవీకాలం స్థిరమైనది కాదని, విస్తృత జాతీయ ప్రయోజనాల కోసం దాన్ని మార్చవచ్చని తన సుదీర్ఘ వివరణలో జేపీసీకి లా కమిషన్ తెలియచేసింది.
మన రాజ్యాంగ వ్యవస్థలో సాధారణ చట్టం ద్వారా లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలాన్ని తగ్గించడం సాధ్యం కాదని, దీనికి కారణం 83, 172 అధికరణాలలో పదవీ కాలాన్ని నిర్దిష్టంగా పొందుపరచడం జరిగిందని లా కమిషన్ పేర్కొంది. అయితే ప్రజా సంక్షేమ విస్తృత ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మార్చవచ్చని కమిషన్ తెలిపింది. బిల్లులో కూడా ఇదే ప్రతిపాదన ఉందని కమిషన్ పేర్కొంది.
చట్ట సభల నిర్వహణలో సౌలభ్యం కోసం రాజ్యాంగం ఆ అవకాశాన్ని కల్పించిందని, కాలపరిమితికి ముందుగానే రద్దు చేయడం, అత్యవసర పరిస్థితులలో కాలపరిమితిని పొడిగించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తున్నట్లు లా కమిషన్ వివరించింది. ఐదేళ్ల పదవీకాలాన్ని మార్చడానికి వీల్లేదన్న భావన సరికాదని పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన వెనుక ఉద్దేశాలలో తక్కువ వ్యయంతో విస్తృత జాతీయ ప్రయోజనాలను సాధించడం ఒకటని లా కమిషన్ వివరించింది.
ఒక దేశం, ఒక ఎన్నిక ప్రతిపాదన ప్రజాస్వామిక ప్రక్రియను బలహీనపరుస్తుందన్న వాదన సరైంది కాదని పేర్కొంది. ప్రతిపాదిత బిల్లు వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందని, తరచూ జరిగే ఎన్నికల భారాన్ని తగ్గించడంతోపాటు పరిపాలనపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుందని కమిషన్ వాదించింది. ఎన్నికలను సమన్వయపరచాలన్న ప్రతిపాదనతో ఓటర్ల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రతిపాదిత బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించబోదని కూడా తెలిపింది.
రాజ్యాంగ సవరణకు రాష్ర్టాల ఆమోదం అవసరం లేదని న్యాయ కమిషన్ తెలిపింది. రాజ్యాంగానికి చేయవలసిన సవరణలు సగం రాష్ర్టాల నుంచి ఆమోదం అవసరమన్న క్యాటగిరీల పరిధిలోకి రావని లా కమిషన్ స్పష్టం చేసింది. ప్రతిపాదిత సవరణ ఆర్టికల్ 368(2) నిబంధనల పరిధిలోకి వస్తుందని, దీనికి రాష్ర్టాల ఆమోదం అవసరం లేదని కమిషన్ తెలిపింది. జమిలి ఎన్నికల కారణంగా భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)కు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఆందోళనలను కూడా లా కమిషన్ తోసిపుచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ఈసీఐకి ప్రతిపాదిత సవరణల్లో ఇవ్వ తలపెట్టిన అధికారాలు దాని అధికారాల విస్తరణగా పరిగణించాలంది.