కన్నాయిగూడెం, మార్చి 12 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త శ్రీకాంత్‌పై బుధవారం పోక్సో కేసు నమోదైనట్టు ఎస్సై వెంకటేశ్ గురువారం తెలిపారు. వారం క్రితం అదేవాడకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలికపై ఇంట్లో ఎవరూలేని సమయంలో శ్రీకాంత్ లైంగికదాడి యత్నించడంతో అరుస్తూ బయటకు పరుగెత్తింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు పంపించినప్పటికీ బాలిక కుటుంబసభ్యులు వినకుండా నిందితుడిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టినట్టు తెలిసింది. బాలిక డయల్ 100కు కాల్ చేసిన తర్వాత నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. గ్రామ పెద్దల సమక్షంలో బాధితులతో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు అవకాశం కల్పిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.