హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రవాణాలో నైజీరియన్లు కొత్తపుంతలు తొక్కుతున్నారు. చెప్పులు, షర్ట్లు, పూల కుండీలు, పుస్తకాలు, గార్మెంట్స్, కాస్మెటిక్స్.. ఇవే డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రధాన వాహకాలుగా వాడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా శ్రీమారుతీ కొరియర్స్, డీటీడీసీ, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్‌రాకెట్, ఇండియాపోస్ట్, డెల్వెరీ, బ్లూడార్ట్, ట్రాక్ఆన్ వంటి కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలంగాణ ఈగల్ ఫోర్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య శుక్రవారం మీ డియాకు వెల్లడించారు.
ఢిల్లీలోని 20 ప్రాంతా ల్లో నిర్వహించిన దాడుల్లో 50 మందికిపైగా వీసా గడువు ముగిసిన నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపా రు. మల్నాడు, మహీంద్ర యూనివర్సిటీల డ్రగ్స్ కేసుల ఆధారంగా నిర్వహించిన భారీ డెకాయ్ ఆపరేషన్‌లో నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 59 మ్యూల్ ఖాతాలను గుర్తించి, వాటితో అనుసంధానమైన మరో 107 బ్యాంక్ ఖాతాలను, వాటిల్లోని నగదును సీజ్ చేశారు. ఈగల్ ఫోర్స్ జరిపిన దర్యాప్తులో ఢిల్లీ డ్రగ్స్ కార్టెల్ నుంచి నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసిన 11 మంది హైదరాబాద్ వినియోగదారులను పోలీసులు గుర్తించారు.
మ్యూల్ ఖాతాల లావాదేవీలు, డెలివరీ ఆధార పత్రా లు, కమ్యూనికేషన్ విశ్లేషణల ద్వారా వీరిని గుర్తించినట్టు సందీప్‌శాండిల్య వెల్లడించారు. వారిలో సాయిగోపాల్, డానిష్ అలియాస్ ఉప్పాడ దానేశ్వరరావు, పవన్ టంగుటూరి, శేషుచౌదరి, మణి, బాబీ చౌదరి, సైఫ్ ఇబ్రహీం, సూర్య అన్నమనేని, సాగిరాజు దినేశ్, సాయి సత్యరామ్భాసర్, సిద్దం శశాంక్సాగర్, అలీ ఉన్నారు. వీరిలో పలువురు ఇప్పటికే పలు కేసుల్లో పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నైజీరియన్లలో కొందరు విద్యార్థి వీసాలపై వచ్చి, కళాశాలలకు హాజరు కాకుండా డ్రగ్స్ అమ్మకం, సెక్స్ ట్రేడ్ ద్వారా డబ్బు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు గుర్తించారు. కాగా, న్యూఇయర్ వేడుకలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.