ఖమ్మం రూరల్, నవంబర్ 28: ప్రజా ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రభుత్వ ఆస్తులను, రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ముటగట్టుకుందని, ఇప్పుడు రాష్టంలో ఏ పల్లెలో చూసినా కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పోలేపల్లిలో పంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్, సీపీఎం పార్టీల సమన్వయ సమావేశం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథులుగా కందాల, సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్‌లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కందాల మాట్లాడుతూ రెండేళ్లు నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ముటగట్టుకుందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక రైతు, ప్రజా సంక్షేమ పథకాలకు తీలోదకాలు ఇచ్చిన అధికార పార్టీ పెద్దలు.. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పరాయోళ్ల పాలనలో పాలేరు నియోజకవర్గం ఆగమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న 21 పంచాయతీలను ఇరు పార్టీలు గెలవబోతున్నాయని వచ్చే పక్షం రోజులు ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి పూర్తి మెజార్టీ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు సంయుక్తంగా బలపరిచిన అభ్యర్థులు వందకు వంద శాతం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్యలో ఉండే మంచి అభ్యర్థులను గుర్తించి సర్పంచ్, వార్డు సభ్యులను పోటీలో నిలపాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీలు యండపల్లి వరప్రసాద్, పెరుమళ్లపల్లి మోహన్‌రావు, సీపీఎం జిల్లా నాయకుడు నండ్రా ప్రసాద్, మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుండెబోయిన దర్గయ్య, లక్ష్మణ్‌నాయక్, ముత్యం కృష్ణారావు, ఆనంద్, సుదర్శన్, అక్కినపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.