తుర్కయాంజాల్/మంచాల, నవంబర్ 28 : జిల్లా ఉనికే లేకుండా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి అప్పటి సీఎం చెన్నారెడ్డి పలు ప్రాంతాలను కలుపుతూ రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. కాగా, 2017లో కాంగ్రెస్ ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను రంగారెడ్డి జిల్లా నుంచి జీహెచ్ఎంసీలో విలీనం చేసింద న్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యంకోసం రంగారెడ్డి జిల్లాను వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డిగా చేసి రూరల్ ప్రాంతాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మార్చిందని గుర్తు చేశా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజలు, అఖిలపక్ష పార్టీల నిర్ణయం తీసు కోకుండానే సీఎం సొంత నిర్ణయం తీసుకున్నారన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ విలీనం చేస్తే పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. ఫ్యూచర్‌సిటీ, జీహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనాన్ని వెంటనే ఆపాలని..లేకుంటే అఖిలపక్ష నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగయ్య, గోపాల్, ఏనుగు ఆనంద్‌రెడ్డి, సంపతీశ్వర్రెడ్డి, అశోక్, మల్లేశ్, దశరథ, రఘునాథ్, సుదర్శన్‌రెడ్డి, చెన్నయ్య, గౌతమ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జాగృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శ్రేణులకు సూచించారు. శుక్రవారం మంచాల మండల కేంద్రంలోని దండేటికార్ ఫంక్షన్హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు ఎప్పడికప్పుడు వివరిస్తూ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుకు పోవాలని సూచించారు. మండలంలో అత్యధిక సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌లను గెలిపించుకునేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తున్నదని మండిపడ్డారు. ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న నగర పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే రంగారెడ్డి జిల్లా ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామాల అభివృద్ధిని పట్టించు కోవడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, పుల్లారెడ్డి, సికిందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్మద, మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, నాయకులు బద్రినాథ్గుప్తా, విష్ణువర్ధన్‌రెడ్డి, సుకన్య, అనిత పాల్గొన్నారు.