రంగారెడ్డి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ(హైదరాబాద్ నగరపాలక సంస్థ)లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. బీజేపీతోపాటు ఇతర పార్టీలూ దానిని నిరసిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయించడంతో త్వరితగతిన అభివృద్ధి చెంది.. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూర్చుతున్నాయి.
దీనిని దృష్టి లో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు జిల్లా పరిధిలోని ఎనిమిది మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుండడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా జీడీపీ కలిగిన రంగారెడ్డి జిల్లాను జీహెచ్ఎంసీలో కలపొద్దని స్థానికులు, మేధావులు, పలు పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీలో కలిపితే జిల్లా ఉనికికే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విలీన మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రజలకు వివరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
జిల్లా ఉనికికే ముప్పుగా మారిన శివారు మున్సిపాలిటీల విలీనాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అందుకోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నది. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి మున్సిపాలిటీల విలీ నం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గత కేసీఆర్ హయాంలో అనేక ఐటీ, ఇతర పరిశ్రమలు రావడంతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందింది. తద్వారా రాష్ర్టానికి ఆదాయాన్ని అందించడంలో అగ్రగామిగా నిలిచింది. రేవంత్ సర్కార్ వచ్చాక ఫోర్త్‌సిటీ పేరుతో రియల్ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రోత్సహించటం తప్ప.. జిల్లా అభివృద్ధికి చేసిందేమీలేదని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలోని ఓఆర్ఆర్ లోపల ఉన్న 8 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట, మణికొండ, జల్పల్లి, శంషాబాద్, బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్, కార్పొరేషన్లున్నాయి. ఇవి ఆదాయ వనరు లను పెంచుకోవడంతోపాటు అభివృద్ధిలోనూ అగ్రగామిగా ఉన్నా యి. వీటిని జీహెచ్ఎంసీలో కలపడం వల్ల ప్రజలకు పరిపాలన దూరమవటమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్ అన్నట్లుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. జిల్లా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలు వేయగా..ప్రస్తుత కాంగ్రెస్ విక్ర యానికి పెడుతున్నది. జిల్లా అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కం పెనీలను తీసుకొచ్చి ఆదాయ వనరులు పెంచగా.. రేవంత్ సర్కార్ ఫోర్త్‌సిటీ పేరుతో రియల్ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తూ.. జిల్లాను అతలాకుతలం చేస్తున్నది.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
దేశంలో అత్యధిక జీడీపీ కలిగిన జిల్లాగా రంగారెడ్డి స్థానాన్ని దక్కించుకున్నది. ఆదాయ వనరుల్లో అగ్రగామిగా ఉన్నది. శివారు మున్సిపాలిటీల్లో భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ల ద్వారానూ జిల్లాకు అధిక ఆదాయం వస్తున్నది. జిల్లా నుంచి ప్రతినెలా రూ. వంద కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి సమకూరుతున్నట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలతో ప్రజలకు పరిపాలనను దగ్గరకు తీసుకొచ్చింది. ప్రత్యేక మున్సిపాలిటీలను ఏర్పాటుచేసి అధికంగా నిధులను మంజూరు చేయడంతో అవి ఎంతో అభివృద్ధి చెందాయి. శివారు మున్సిపాలిటీల విలీనంతో ప్రజలకు పరిపాలనకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
-పల్లె గోపాల్‌గౌడ్