ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 28 : ఓయూ టెక్నాలజీ కాలేజీలో దారుణం చోటు చేసుకున్నది. ఉన్నతవిద్యతోపాటు నైపుణ్యాలు నేర్పించాల్సిన అధ్యాపకుడే విద్యార్థినుల పాలిట కీచక అవతారమెత్తాడు. విసిగివేసారిన విద్యార్థినులు తోటి విద్యార్థులతో కలిసి శుక్రవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో అధ్యాపకుడు రవీందర్ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని బీటెక్ ఫస్టియర్ విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏవైనా అడిగితే తన చాంబర్‌కు రావాలని వేధిస్తున్నాడని వాపోయారు. తరగతులు ముగిసిన అనంతరం సెల్ఫోన్లో చాటింగ్ చేయాలని, ఫోన్ చేయాలని మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నాడని భోరుమన్నారు. బయటకు వెళ్తే తానూ వస్తానని అనేవాడని పేర్కొన్నారు.
భయంభయంగా కళాశాలకు వచ్చే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు ఘటనా స్థలానికి చేరుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, ఉన్నతాధికారుల అనుమతి ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడు డాక్టర్ రవీందర్‌ను సంప్రదించగా, తాను కొంతకాలంగా బీటెక్(బయో టెక్నాలజీ) కోర్సు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. దీనిని అడ్డుకునేందుకు కొంతమంది కావాలని తనను టార్గెట్ చేసి, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.