గులాబీ దళం కదంతొక్కుతున్నది.. పల్లెపల్లెనా ప్రచారం జోరుగా సాగుతున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్లగా అపూర్వ స్వాగతం లభించింది. పటాకుల మోత, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య బతుకమ్మలు, బోనాలతో మహిళలు స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి విజయం ఖాయమంటూ ఆశీర్వదించారు. ఏ ఊరు చూసినా గులాబీవనంలా మారింది. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అన్న నినాదాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి బురిడి కొట్టించే ప్రయత్నాలు చేస్తారని.. నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పాలన కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, బీఆర్ఎస్ గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ వల్ల బానిస బతుకుల కన్నీటి చరిత్రే మిగిలిందని, దేశాన్ని దోచుకుంటున్న బీజేపీని భూస్థాపితం చేయాల్సిన అవసరముందని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
చేవెళ్ల రూరల్, అక్టోబర్ 17 : చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీని.. తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మసాగర్ పరిధి బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచార రథాలను ప్రారంభించారు.
పూజల అనంతరం రావులపల్లి గ్రామం నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్ శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రావులపల్లిలో ఇదివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరు చేసిన నిధులపై ప్రజలకు వివరించారు. అనంతరం ముడిమ్యాల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసి తనను గెలిపించాలని కోరారు. ముడిమ్యాల్ సర్పంచ్ శేరిస్వర్ణలతాదర్శన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని డప్పు చప్పుళ్లు, పటాకుల మోత నడుమ ప్రచారం ఉత్సాహంగా సాగింది. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి 9 ఏండ్ల కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని, ప్రస్తుత అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలని అన్నారు. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాము లు, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, సర్పంచ్‌లు మాణిక్యరెడ్డి, వెంకటేశం గుప్తా, విజయలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, గిరిధర్ రెడ్డి, నాయకులు శేరి శ్రీనివాస్, వంగ శ్రీధర్ రెడ్డి, శేరి రాజు, శ్రీనాథ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.