షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్12: గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు ఉండేవికావు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ముందు వెళ్లే వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి. తెలంగాణ సర్కార్ పట్టణాల అభివృద్ధికి, సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. పట్టణాల ప్రధాన దారుల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నది. దీంతో పట్టణం ప్రధాన దారుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుగుల్లో వాహనదారులు తమ ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ చొరవతో షాద్‌నగర్ పట్టణంలోని పాతజాతీయ రహదారి మధ్యలో నూతనంగా బటర్‌ఫ్లై లైట్స్‌ను ఏర్పాటు చేశారు.
షాద్‌నగర్ పాతజాతీయ రహదారి మధ్యలో నూతనంగా బటర్‌ైప్లె లైట్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపాలిటీలో సరికొత్త శోభను సంతరించుకున్నది. గతంలోనే పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి పట్టణ ముఖ్యకూడలి, పరిగిరోడ్డులో ఎల్ఈడీ విద్యుత్ దీపాలతో పాటు ముఖ్యకూడలిలో హైమాస్ట్ లైట్లను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుగులో వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలను సాఫీగా సాగిస్తున్నారు. పాతజాతీయ రహదారి మధ్య టీఎఫ్ఐడీసీ నిధులు సుమారు కోటి రూపాయాలతో ఏర్పాటు చేసిన బటర్‌ైప్లె లైట్స్‌ను ఇటివలే మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ప్రారంభించారు.
ఇప్పటికే అభివృద్ధి పనులతో షాద్‌నగర్ పట్టణం సుందరంగా మారింది. దీనికి తోడు ఎల్ఈడీ విద్యుత్ దీపాలతో పట్టణం సరికొత్త శోభను సంతరించుకున్నది. రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలతో పట్టణం కళకళలాడడం సంతోషంగా ఉంది. రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాల నడుమ ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నా.
-మహేందర్, వాహనదారుడు, షాద్‌నగర్
పాతజాతీయ రహదారి మధ్య నూతనంగా ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. గతంలో రాత్రి సమయాల్లో ఈ రోడ్డుపై వాహనాలను నడిపేందుకు భయంగా ఉండేది. విద్యుత్ కాంతుల మధ్య వాహనదారులు ప్రమాదాలు చోటు చేసుకోకుండా రాకపోకలు సాగిస్తున్నారు.
-కృష్ణ, వాహనదారుడు, షాద్‌నగర్