యాచారం, మే 14 : వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్చుకునేవి. ప్రస్తుతం చుక్క నీరు లేక నీటి తొట్లు వెలవెలబోతున్నాయి. కొన్ని గ్రామాల్లో నీటి తొట్ల జాడే లేదు. మరికొన్ని గ్రామాల్లో ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉండటంతో వాటికి పగుళ్లు వచ్చి, నెర్రెలుబారి శిథిలావస్థకు చేరుకున్నాయి.
పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి నిర్వహణ బాధ్యతను గాలికొదిలేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. పైగా ఎండాకాలంలో మండలంలోని చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోవడంతో తాగడానికి నీళ్లు లేక గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నాయి. రైతులు, జీవాల పెంపకందారులు బిందెల ద్వారా ఇంటి నుంచి నీరు తీసుకెళ్లి వాటి దాహార్తిని తీరుస్తూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని మేడిపల్లి, నందివనపర్తి, గున్గల్, నానక్‌నగర్, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, పిల్లిపల్లి, మంగలిగడ్డతండా, ధర్మన్నగూడ, భాషమోనిగూడ, చౌదర్పల్లి, కొమ్మోనిబావి, గొల్లగూడ, తమ్మలోనిగూడ, చింతపట్ల, తులేఖుర్దు, కుర్మిద్ద, తాటిపర్తి, మంథన్‌గౌరెల్లి తదితర మేజర్ గ్రామపంచాయతీల్లో నీటి తొట్ల వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో తాగునీరు లేక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన నీటి తొట్లు వృథాగా మారాయి. మేడిపల్లిలో పలు నీటి తొట్లు ఇప్పటికే నేలమట్టమయ్యాయి. కుర్మిద్దలో వాటర్ ట్యాంకు వద్ద ఉన్న నీటి తొట్టిని పూర్తిగా పూడ్చివేశారు.

తాటిపర్తిలో రాళ్లతో నింపారు. పలు గ్రామాల్లో గోడలు కూలిపోయి అధ్వానంగా మారాయి. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ఇలా ఎన్నో నీటి తొట్లు నీరులేక నిరుపయోగంగా మారాయి. జీవాల పెంపకం అధికంగా ఉన్న గ్రామాల్లో నీటి తొట్లను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్నవాటికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని జీవాల పెంపకందారులు కోరుతున్నారు. అవసరమైన గ్రామాల్లో నూతనంగా నీటి తొట్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
నీటి తొట్లలో నీరు లేకపోవడంతో పశువులకు సకాలంలో తగిన నీరు అందించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్లు, మేకలు మేత మేసిన తరువాత వాటికి తాగడానికి నీరు లేక గోసపడుతున్నాయి. పంచాయతీ అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. నిత్యం పశువుల తొట్లలో తగినంత నీరు నింపి జీవాల దాహార్తి తీర్చాలి. పలు చోట్ల ఎండాకాలంలో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పశువులకు నీరు దొరకడంలేదు. రైతులు ఇంటికొచ్చాక జీవాలు, పశువులకు నీరు తాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. పంచాయతీ కార్యదర్శులు నీటి తొట్ల నిర్వహణపై నిర్లక్ష్యం వీడాలి. నీటి తొట్లలొ నీరు నింపితే జీవాల పెంపకందారులు, రైతులకెంతో మేలు జరుగుతుంది.
– రవీందర్‌రెడ్డి, నజ్దిక్‌సింగారం, యాచారం
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న నీటి తొట్లను నీటితో నింపేందుకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు సహకరించాలి. నిరుపయోగంగా ఉన్న నీటి తొట్లను ఉపయోగంలోకి తీసుకురావాలి. అవసరమైతే పంచాయతీ ట్రాక్టర్లతో పశువుల తొట్లు నింపేందుకు కృషి చేయాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రజాప్రతినిధులు సైతం సహకరించాలి. సమస్య అధికంగా ఉన్న గ్రామాల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
– నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో, యాచారం