రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్‌రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు మం డలాల్లోని పలు గ్రామాల్లో ట్రిపులార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లోని పలు సర్వేనంబర్ల నుంచి భూములను తీసుకుంటామని ప్రభు త్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో బాధిత రైతు లు సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. తమకు తెలియకుండా..తమ భూములను తీసుకునే అధికారం సర్కార్‌కు ఎవరిచ్చారని మండిపడుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు వేసుకుని జీవిస్తున్న పల్లె ప్రజలపై ఒక్కసారిగా ట్రిపులార్ ప్రకటన పిడుగు పడినట్లయ్యింది. తమ భూ ములను ట్రిపులార్‌కు ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదిత గ్రామాల్లో రోజురోజుకూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే ఆమనగల్లు మండల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సంకటోన్పల్లి, తౌరుపల్లి, చంద్రధన గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అలాగే, మల్రెడ్డిపల్లి, సిం గంపల్లి, పోలెపల్లి గ్రామాల రైతులు కలెక్టర్‌ను కలిసి తమ భూములను తీసుకోవద్దని వినతిపత్రాన్ని అం దించారు. మాడ్గుల మండలంలో ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తహసీల్దార్, కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు.
మండలంలోని వెంకట్రావుపేట, గౌరిపల్లి, ఖానాపూర్, జంగారెడ్డిపల్లి, చంద్రధన గ్రామాలకు చెందిన రైతులు ఇప్పటికే ఆందోళనకు దిగారు. కొం దుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో రైతులు తమ భూ ములను తీసుకోవద్దని రోడ్డెక్కారు. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకులు, నిడుదవెల్లి గ్రామాలకు చెందిన రైతులు ట్రిపులార్‌కు తమ భూములను ఇచ్చేదిలేదని ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. రైతుల ఆందోళనకు పలు పార్టీలు, ప్రజాసంఘాలూ మద్దతు ప్రకటించాయి. రీజినల్రింగ్రోడ్డు బాధిత రైతుల ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చనున్నది.
తొమ్మిదిరేకుల గ్రామంలోని 54, 55, 57 సర్వేనంబర్లలో నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని ఆర్ఆర్ఆర్ నిర్మాణంకోసం ఎంపిక చేసినట్లు ప్రకటించారు. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆ భూమి పోతే మా కుటుంబం ఎలా బతకాలి. మేము రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – పుట్నాల మహాలింగం, రైతు, తొమ్మిదిరేకుల, కేశంపేట
తొమ్మిదిరేకుల గ్రామంలోని సర్వేనంబర్ 47లో నా తల్లిదండ్రులు రంగయ్య, సావిత్ర మ్మ నుంచి నాకు వారసత్వంగా 4.20 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమిని నమ్ముకొని జీవిస్తున్నా. నాన్న పక్షవాతంతో బాధపడుతున్నాడు. కుటుంబ పోషణకు ఆ భూమే ఆధా రం. అది పోతే నా కుటుంబానికి చావే శరణ్యం
– కాసారపు సత్యనారాయణ, రైతు, తొమ్మిదిరేకుల ,కేశంపేట
రీజినల్ రింగ్‌రోడ్డును ఇప్పటికీ మూడుసార్లు మార్చారు. గతంలో కొత్తపేట-కేశంపేట, సుందరాపురం-బొదునంపల్లి, కాకునూరు మీదుగా అన్నారు. ఇప్పుడు మా గ్రామం తొమ్మిదిరేకుల మీదుగా మళ్లిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న మా భూములపై గద్దల్లా వాలడం సరికాదు. మా గ్రామం మీదుగా రహదారి నిర్మా ణం అవసరమే లేదు.
– చిట్టిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు, తొమ్మిదిరేకుల, కేశంపేట