Moinabad | మొయినాబాద్, మార్చి24 : ప్రజాపాలనలో గ్రామీణ రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజలు తమ రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయమైన రోడ్లు లేకపోవడంతో తప్పదన్నట్లుగా గుంతలమయంగా మారిన రోడ్ల వెంబడి ప్రయాణం చేయక తప్పడం లేదు. ఏ మాత్రం కనురెప్ప మూసిన వారి పని ఖతమేన్నట్లుగా రోడ్లు తయారైనాయి. బీటీ రోడ్లు గుంతలమయంగా మారడంతో పాటు బీటీ రోడ్లు కాదు మట్టి రోడ్ల మాదిరిగా కనిపిస్తున్నాయి. ఇలాంటి దుస్థితి చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మున్సిపాలిటి, మొయినాబాద్ మండలంలోని గ్రామీణ రోడ్లు కనిపిస్తున్నాయి.
మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని పెద్దమంగళారం నుంచి మొయినాబాద్ మండల పరిధిలోని చందానరగ్ గేట్ వరకు రోడ్డు పూర్తిగా దయనీయ పరిస్థితిలో దర్శనం ఇస్తుంది. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం నుంచి చిన్నమంగళారం గ్రామం వరకు ఉన్న రోడ్డు, మోత్కుపల్లి రోడ్డు సైతం దారుణంగా మారాయి. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామం నుంచి వయా శ్రీరాంనగర్ వెంకటాపూర్ గ్రామం వరకు గత పంచాయతీ రాజ్ రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రస్తుతం బీటీ రోడ్డు కాదు మట్టి రోడ్డును తలపిస్తుంది. ఏ మాత్రం వర్షం పడిన రోడ్డు కరిగట్లను తలపిస్తుంది. సుమారుగా 8 కిలో మీటర్ల వరకు రోడ్డు గుంతలుగా మారడంతో పూర్తిగా బీటీ, కంకర తేలి మట్టి రోడ్డుగా కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద వెళ్లే ప్రజలు సుమారుగా 8 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయాలి అంటే నరకం అనుభవిస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి నుంచి వయా కనకమామిడి, కంచమోనిగూడ గ్రామాల మీదుగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు పూర్తిగా గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు. ఇలా మొయినాబాద్ మండలం, మున్సిపాలిటి పరిధిలోని దారులు దారుణంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి వేగంగా వాహనాలు నడిపితే మాత్రం వాహనదారులు ప్రాణాలు పోవడం కాని లేదా అవిటివారు కావడం ఖాయంగా కనిపిస్తుంది. గుంతల రోడ్లతో ఇప్పటికే చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి దుస్థితి ఉంటే ప్రజాప్రతినిధులు ఎవరు కూడ ప్రజలు బాధలను పట్టించుకునే నాథుడే లేరు. ప్రజాపాలన ఏ ప్రజాప్రతినిధికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైన ప్రజలు పడుతున్న బాధలను అధికారులు, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని వర్షాకాలం రాక ముందే రోడ్లు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.