పరిగి, ఏప్రిల్ 20 : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పరిగిలో బీఎస్పీ పరిగి నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి విజయ్ ఆర్యన్ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ అశోక్‌లు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. తాము బీఆర్ఎస్ను కాదనుకొని కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేండ్ల కిందటి పరిస్థితి మరోసారి పునరావృతమవుతుందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.
కనీసం తాగునీరు సైతం సక్రమంగా అందించలేని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీకి ఉందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి తప్పదన్నారు. బీఎస్పీ నాయకులు ఆనంద్, విజయ్ ఆర్యన్లు మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.