రంగారెడ్డి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : రుణమాఫీపై ధోకా చేసిన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. మాఫీకి నోచుకోక ఆందోళన చెందుతున్న రైతాంగానికి బాసటగా నిలవాలని సంకల్పించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాకు పిలుపునివ్వడంతో గురువారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించేందుకు గులాబీ దళం సన్నద్ధమైనది. చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించే ధర్నాలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. జిల్లా రైతులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొననున్నారు.
ప్రభుత్వానికి ‘మాఫీ’ సెగ..
కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో చేసిన రుణమాఫీ ప్రక్రి య ప్రహసనంగా మారింది. అర్హత ఉన్నప్పటికీ లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వివిధ నిబంధనలు, కొర్రీలతో అర్హులైన రైతులకు సైతం మాఫీని ఎగ్గొట్టింది. జిల్లాలో మూడు విడతల్లో కలిసి జిల్లాలో 87,612 మందికి రూ.660.72 కోట్లను మాత్రమే మాఫీ చేసింది. అర్హత కలిగిన రైతులు లక్షల్లో ఉండగా..వేలల్లోనే మాఫీ చేసి మమ అనిపిం చింది. దీంతో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించక నేటికీ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ బాధిత రైతులు ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గురువారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నది. ఇందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం..
ఆంక్షల్లేకుండా అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శ్రీనగర్‌లోని తన నివాసంలో చేవెళ్ల మండల ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నాకు పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీపై నిర్వహించనున్న ధర్నాతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు రుణమాఫీపై కాంగ్రెస్ నైజాన్ని బయట పెడతామన్నారు. గురువారం ఉదయం 11.00 గంటలకు చేవెళ్ల మండల కేం ద్రంలోని వేంకటేశ్వరాలయం వెనుక ఉన్న ప్రాంతంలో ధర్నా జరుగుతుందని.. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పట్లోళ్ల కౌశిక్ రెడ్డి, చేవెళ్ల మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉదయం పది నుంచే ధర్నాలు
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, ఆగస్టు 21 : రైతులందరి పంట రుణాలను ఎలాం టి ఆంక్షలు, కొర్రీల్లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా లు నిర్వహిస్తామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు ఉంటాయని.. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతాం..
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 21 : రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా గురువారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం తొమ్మిది గంటలకు బీఆర్ఎస్ ఆధ్వర్యం లో రైతు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ నిరసనకు నియోజకవర్గానికి చెందిన అన్నదాతలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి. ఈ ధర్నాలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతాం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరి రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే