పరిగి, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పరిగి నియోజకవర్గం నుంచి 60 బస్సులు, 200 ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివెళ్తామని మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్‌రెడ్డి తెలిపారు. రజతోత్సవ మహాసభకు సంబంధించి ఆదివారం పరిగిలో ఆయన దగ్గరుండి వాల్ పెయింటింగ్ చేయించారు. ప్రధాన రహదారిపై గల ప్రతి గ్రామంలోనూ వాల్ పెయింటింగ్‌లు వేయించాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా జరిగే సభను ప్రతి ఒక్కరూ తమ ఇంటి పండుగలా భావించి, స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు బీఆర్ఎస్ ఒక్కటే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని.. హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైనదని విమర్శించారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రవికుమార్, కృష్ణ, తాహెర్‌అలీ పాల్గొన్నారు.
వరంగల్‌లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి నియోజకవర్గ సన్నాహక సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు పరిగిలోని బృందావన్ గార్డెన్లో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. దీనికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ కమిటీల నాయకులు హాజరు కావాలన్నారు.