మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కొడంగల్ నియోజకవర్గానికి వచ్చారు. కేటీఆర్ రాకతో ప్రజల్లో నూతనోత్తేజం నెలకొన్నది. కేటీఆర్‌కు గిరిజన మహిళలు మంగళహారతులు, నృత్యాలతో స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని కోస్గిలో జరిగిన రైతు దీక్షా సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా వెళ్లారు. అంతా గులాబీమయంగా మారింది. ప్రజలకు తామున్నామని కేటీఆర్ భరోసా కల్పించారు. దీక్షా సమావేశానికి వచ్చిన జనసంద్రాన్ని చూసి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకుల్లో గుబులురేపింది. దాదాపు 14 నెలలుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు ఈ ప్రాంతంలో జరుగకపోవడంతో గులాబీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. లగచర్ల ఘటనతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులకు, ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైలుకు వెళ్లడంతో మరింత డీలాపడిపోయారు. జైలు నుంచి వచ్చిన తరువాత గులాబీ దళంలో ఆశలు చిగురించాయి.
– కొడంగల్, ఫిబ్రవరి 11
సోమవారం జరిగిన దీక్షా సమావేశానికి కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాలతో పాటు తుంకిమెట్ల, హకీంపేట, నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లో అన్ని గ్రామ తండాల నుంచి పెద్దఎత్తున జనాలు తరలివచ్చారు. దుద్యాల మండలంలోని రోటిబండతండా, పులిచెర్లకుంటతండాలు మొత్తంగా ఇండ్లకు తాళం వేసి రామన్నను కలుసుకునేందుకు కోస్గికి తరలివెళ్లారు. సభా స్థలం జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడ చూసినా గులాబీమయం.. కేసీఆర్, కేటీఆర్, నరేందర్‌రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలనే నినాదాలతో కోస్గి పట్టణం మార్మోగింది.
కేటీఆర్ దీక్షా శిబిరానికి తరలివచ్చే క్రమంలో ప్రతి గ్రామం, తండా ప్రజలను పలుకరిస్తూ అభివాదం, కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. తుంకిమెట్లలో జెండా ఎగురవేసి, హకీంపేటలో రైతుల బాగోగులపై ఆరా తీశారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భూమిని కోల్పోతున్న రైతులు ఉదయం నుంచి కేటీఆర్ రాక కోసం తండాలు, గ్రామాల్లో వేయి కండ్లతో ఎదురుచూశారు. దాదాపు సంవత్సర కాలంగా తండాల్లో ఎటువంటి సంతోషం లేకుండా ఉండిపోయారు. మళ్లీ కేటీఆర్ రాకతో గిరిజనుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. గిరిజన మహిళలు మంగళహారతులు, సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. తమ బాధలను బీఆర్ఎస్ పార్టీ గుర్తించిందని పేర్కొన్నారు. వారికి తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సభలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టారు. ఇచ్చిన హామీలు, పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లగచర్లలో భూములను పరిశీలించి.. పచ్చటి పంట పొలాలు ఉన్న భూములను తొండలు గుడ్లు పెట్టే భూములనడం ముఖ్యమంత్రి నోటికి ఏవిధంగా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధతో విన్నారు. తమకు అండగా బీఆర్ఎస్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లిన భర్తను దక్కించుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిన జ్యోతి కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆమె బిడ్డకు మహా నేత పేరు పెట్టడంపై గిరిజన బిడ్డలు హర్షం వ్యక్తం చేశారు. రైతు దీక్ష సభను సక్సెస్ చేయడంలో పాలుపంచుకున్న ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.