BRS Party | షాద్‌నగర్, మార్చి 14 : ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అక్రమ సస్పెన్షన్‌ను ఖండిస్తూ షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెన్షన్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే ఓర్వలేక ఉద్దేశ్యపూర్వకంగానే కుట్రలకు పాల్పడుతూ సభనుంచి బయటకు పంపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ మన్నె కవిత నారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎంఎస్.నటరాజ్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, నాయకులు వీరేశంగుప్త, వెంకట్రాంరెడ్డి, పిల్లి శేఖర్, సుధీర్, జూపల్లి శంకర్, పాపయ్యయాదవ్, భిక్షపతి, రాఘవేందర్, ఉమాప్రసాద్, హరి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.