షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నించారు. మంగళవారం రాత్రి షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫారూఖ్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండా దిమ్మెపై దాడిచేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. జెండా పైపును వంచివేశారు. బుధవారం ఉదయం గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పార్టీ దిమ్మెను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దిమ్మె పక్కనే మరో రెండు పార్టీ ల జెండా దిమ్మె ఉన్నప్పటికి కేవలం బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను, ఇనుప పైపును తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.