వికారాబాద్, ఫిబ్రవరి 16 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి గల్లీ రాజకీయాల వరకు, ఆరోగ్యం నుంచి అంతర్జాతీయం వరకు దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ నెల 19న తెలంగాణ భవన్లో జరుగబోయే విస్తృతస్థాయి సమావేశం, పార్టీ సభ్యత్వం, తొందర్లో నిర్వహించబోయే ప్లీనరీ సమావేశాలు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో నూతన కమిటీలు, ప్రత్యర్థుల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రారంభమై, విజయవంతంగా అమలై ప్రజల మన్ననలు పొందిన చాలా పథకాలు కాంగ్రెస్ పాలన రాగానే వాటి అమలులో వైఫల్యాల గురించి చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో అతి సునాయసంగా వందకు పైగా సీట్లు సాధించి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కేసీఆర్ తెలిపినట్లు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. అనంతరం జనగాం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఎస్ఐఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.