చేవెళ్ల రూరల్, జనవరి 9 : సాధ్యం కాని హామీ లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ఫ్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, కనీస వేతన సలహామండలి రాష్ట్ర మా జీ చైర్మన్ పి.నారాయణ అన్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కేసారం గ్రామ రెవెన్యూలో ఉన్న బృందావనం కాలనీలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చి రిబ్బన్లు కట్‌చేసి ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దే వా చేశారు. అభివృద్ధి పనులు అంటే మా హ యాంలో చేసినవి మీరు ఓపెన్ చేయడమేనా అని ప్రశ్నించారు.
హైదరాబాద్-బీజాపూర్ హైవే ముడిమ్యాల్ గేట్ నుంచి రావులపల్లి, మేడిపల్లి వరకు రూ.34 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఈనె ల 8న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేసిన రోడ్డుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జీవో జారీ అయిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. అప్పుడు రూ.34 కోట్లు, ఇప్పుడు సంఖ్యలో ఏం మార్పు జరుగలేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నదని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు.
షాబాద్, చందనవెల్లిలో అనేక పరిశ్రమల ఏర్పాటు, శంకర్‌పల్లిలో రైల్వే కోచ్ ఏర్పాటు వంటి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, తులం బంగారం, రూ.లక్ష ఇస్తామని హామీలు గుప్పించినా.. వాటి ఊసే లేదన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెపుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విఘ్నేశ్ గౌడ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బ్యాగరి నర్సింహులు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, దేవరంపల్లి, ఖానాపూర్ మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎల్లన్న, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపుతూ మేం చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు అప్పా నుంచి మన్నెగూడ వరకు హైవే నిర్మాణానికి ఎందుకు చొరవ తీసుకోవడం లేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి వెళ్లాలంటే ఈ రోడ్డు గుండా వెళ్తారని, పనులు ప్రారంభం కాకపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.